ములుగు/మర్కూక్, జూన్ 15 : సిద్దిపేట జిల్లా మలుగు మండల పరిధిలోని కొండపోచమ్మ రిజర్వాయర్‌ను కలెక్టర్ మనుచౌదరి శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా రిజర్వాయర్‌లో నీటినిల్వ సామర్థ్యం, భూసేకరణ, కాల్వల ఏర్పాటు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పునరావాస గ్రామమైన మామిడ్యాల్ను సందర్శించి తాత్కాలిక కేంద్రాల్లో ఉంటున్న కుటుంబాలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా భూనిర్వాసితులు తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఇండ్లలో సరైన వసతులు లేవని, ఇంకా చాలా కుటుంబాలకు ప్లాట్లు రావాలని, తమకు న్యాయం చేయాలని కలెక్టర్‌కు విన్నవించారు. స్పందించిన కలెక్టర్ మామిడ్యాల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమిలో 100 ప్లాట్లను సిద్ధం చేయాలని గజ్వేల్ ఆర్డీవో బన్సీలాల్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో కొండపోచమ్మ సాగర్ ఎస్ఈ వేణు, ములుగు తహసీల్దార్ ప్రవీణ్‌రెడ్డి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.