అక్కన్నపేట, మార్చి 13: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయాలని కలెక్టర్ మనుచౌదరి అన్నారు. బుధవారం మండలంలోని గౌరవెల్లి ప్రాజెక్టను ఆయన ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన డిజైన్ మ్యాపులను పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు ఇప్పటికే సుమారు 95 శాతం పూర్తి కాగా, మిగతా పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేసే విధంగా ప్రణాళికలు తయారు చేయాలన్నారు.
కుడి, ఎడమ కాల్వల నిర్మాణాలు, అందుకు అవసరమయ్యే భూసేకరణ, ఇతరత్రా సమస్యలను గుర్తించి పరిష్కరించే విధంగా నివేదికలు తయారు చేసి తీసుకు రావాలన్నారు. ప్రాజెక్టుపై ఉన్న ఎన్జీటీ కేసు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి, ఉన్నతస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు. నిబంధనలు, చట్టం ప్రకారం ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రాజెక్టుకు కావాల్సిన నిధులను విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు నిధుల కొరత లేదన్నారు. కలెక్టర్ వెంట ఆర్డీవో బెన్షాలోమ్, తహసీల్దార్ సంజీవ్‌కుమార్, ప్రాజెక్ట్ ఇరిగేషన్ డీఈఈలు ప్రశాంత్, కరుణ శ్రీ, ఏఈ ఉన్నారు.
హుస్నాబాద్, మార్చి 13: హుస్నాబాద్ మండలం గాంధీనగర్‌లోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను కలెక్టర్ మనుచౌదరి బుధవారం సందర్శించారు. కళాశాలలో వసతులు, తరగతి గదుల నిర్వహణ, ల్యాబ్‌లను పరిశీలించారు. కళాశాలకు ఇంకా కావాల్సిన పనులను ప్రిన్సిపాల్ సతీశ్‌కుమార్ కలెక్టర్‌కు వివరించారు. కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా కలెక్టర్ హామీ ఇచ్చారు. ఈయన వెంటన ఆర్డీవో బెన్ షాలోమ్ తదితరులు ఉన్నారు.