సిద్దిపేట అర్బన్, జనవరి 8: జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు నేరుగా ప్రజల సమస్యలు విని పరిష్కరించడానికి మొదలుపెట్టిన గొప్ప కార్యక్రమం ప్రజావాణి అని అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి ఆమె అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లా నలుమూలల నుంచి తమ సమస్యలు నేరుగా విన్నవించి పరిష్కరించుకోవడానికి అర్జీదారులు ఎంతో ఆశతో కార్యాలయానికి వస్తారని.. వారందరికీ న్యాయం చేయడం అధికారులుగా మన కర్తవ్యం అని అధికారులకు సూచించారు. అర్జీదారుల నుంచి తీసుకున్న ఫిర్యాదులు త్వరగా పరిష్కరించి నివేదిక అందజేయాలన్నారు అర్జీదారులకు ప్రజావాణి కార్యక్రమంపై నమ్మకం పెరిగిందని, క్రమక్రమంగా అర్జీదారుల సంఖ్య పెరుగుతుండడంతో అధికారులు ఎంతో ఉత్సాహంతో పనిచేయాలన్నారు. వివిధ సమస్యలపై 24 దరఖాస్తులు అందాయని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో నాగరాజమ్మ, డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్యా, అధికారులు పాల్గొన్నారు.
సిద్దిపేటరూరల్, జనవరి 8: సిద్దిపేట రూరల్ మండలంలోని 14 గ్రామ పంచాయతీల్లో సీజీఐ ద్వారా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రాం (ఎస్వీఎంపీ) అమలు కానుంది. ఇందులో భాగంగా సోమవారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన స్టాల్‌ను అదనపు కలెక్టర్ గరిమాఅగర్వాల్ పరిశీలించారు. మూడేండ్ల వ్యవధి గల ఈ ప్రాజెక్టుకు సాహస్ అనే సంస్థ మద్దతు ఇస్తోంది. రాబోయే రోజుల్లో బ్లాక్‌లను విస్తరింపజేయనున్నారు. ప్రజాపాలనలో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో స్టాల్ ఏర్పాటు చేయడంతో పాటు సాహస్ సభ్యులు ప్రజలకు ప్యాకెట్ క్యాలెండర్‌ను పంపిణీ చేస్తోంది. ఇందులో వ్యర్థాలను పారబోయడం వల్ల కలిగే ప్రభావాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.