చేర్యాల, డిసెంబర్ 4: సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలో జీపీ ఎన్నికల్లో కోడ్ ఉల్లంఘన జరుగుతున్నది. సర్పంచ్ పదవులు దక్కించుకునేందుకు పలువురు అభ్యర్థులు భారీగా డబ్బులు ఆఫర్లు చేస్తున్నారు.గ్రామాభివృద్ధి అనే సాకుతో పలువురు లక్షలాది రూపాయలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు.కడవేర్గు గ్రామ సర్పంచ్ పదవి కోసం గురువారం గ్రామంలో పోటీచేస్తున్న అభ్యర్థులు కుల సంఘాలు,గ్రామ పెద్దలతో సమావేశమయ్యారు. ఆర్థికంగా బలంగా ఉన్న ఇద్దరు అభ్యర్థులు సర్పంచ్ పదవికి తమను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.60లక్షలు ఇస్తానని ఒకరు ప్రకటించగా, మరో అభ్యర్థి రూ.51 లక్షలు ఇస్తానని ఆఫర్ ఇచ్చారు.
మరో అభ్యర్థి మాత్రం తన వద్ద డబ్బులు లేవని, గ్రామస్తులు ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి తాను కట్టుబడి ఉంటానని తెలియజేశాడు. డబ్బుల విషయం మాట్లాడుతున్న సమయంలో అదే గ్రామానికి చెందిన ఓ యువకుడు సర్పంచ్‌గా పోటీ చేసేందుకు నామినేషన్ కేంద్రానికి వెళ్లి నామినేషన్ దాఖలు చేశాడు. సర్పంచ్‌గా పోటీ చేసేందుకు నామినేషన్లు వేస్తున్నారన్న విషయం తెలుసుకున్న అభ్యర్థులతో పాటు గ్రామ నాయకులు హడావిడిగా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఏకగ్రీవం ముచ్చట మరో రోజుకు వాయిదా పడింది.
కొత్తదొమ్మాట గ్రామంలో సర్పంచ్ పదవి తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ. 10లక్షలు గ్రామాభివృద్ధికి ఇస్తానని ఒకరు ముందుకు వచ్చాడు. గ్రామంలోని పలు ఆలయాలకు మరమ్మతులతో పాటు చేర్యాల-నంగునూరు ప్రధాన రహదారికి పక్కనే ఉన్న గ్రామ బస్‌స్టేజీ వద్ద స్వాగత తోరణం నిర్మాణ పనులు ప్రారంభించాడు. రోజురోజుకు గ్రామంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్నది. డబ్బులు ఉన్న వ్యక్తులు ఏకగ్రీవం చేసుకోవాలని ఆఫర్లు ప్రకటిస్తున్నారు.