మెదక్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. నేడు జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తెలంగాణ భవన్‌ను ప్రారంభించనున్నారు. ఈ మేరకు అధికారుల, పార్టీ వర్గాలు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సీఎం పర్యటనలో భాగంగా ముందుగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయం, జిల్లా సమీకృత కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. పార్టీ కార్యాలయాన్ని బీఆర్ఎస్ అధిష్ఠానం ఎకరం స్థలంలో నిర్మించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఒకే నమూనాలో పార్టీ కార్యాలయాలను నిర్మించాలని భావించి అందుకోసం నిధులు సైతం మంజూరు చేసింది. ఇందులో భాగంగా మెదక్ జిల్లాలో రూ.60లక్షలతో పార్టీ కార్యాలయాన్ని నిర్మించింది.
రూ.60 లక్షల వ్యయంతో…
జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని రూ.60 లక్షల వ్యయంతో సిద్ధం చేశారు. అన్ని హంగులతో విశాలమైన గదులు, పార్టీ ముఖ్య నాయకులకు ప్రత్యేక కార్యాలయం వంటి సౌకర్యాలు ఆకట్టుకుంటుండడం విశేషం. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణాన్ని చేపట్టారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు తగ్గట్టుగా జిల్లా పార్టీ కార్యాలయాన్ని తీర్చిదిద్దారు.
సమావేశాలు, సమీక్షలకు వేదికగా…
మెదక్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ భవన నిర్మాణం పూర్తయింది. దీని వైశాల్యం 8,352 చదరపు అడుగులు. భవనాన్ని వివిధ విభాగాలను విభజించారు. పార్టీ కార్యాలయం విస్తీర్ణం 2,527 చదరపు అడుగులుగా ఏర్పాటు చేశారు. దీని పక్కనే మీటింగ్ హాల్‌ను నిర్మించారు. విశాలంగా ఉన్న సమావేశ మందిరంలో వందలాది మంది కార్యకర్తలతో మీటింగ్‌లు పెట్టుకోవచ్చు. జిల్లా, నియోజకవర్గ, మండలస్థాయి సమావేశాలకు ఈ భవనం వేదికగా నిలువనున్నది. సమావేశం హాల్ వైశాల్యం 4,712 చదరపు అడుగులు. ఆ పక్కనే 489 చదరపు అడుగుల్లో కిచెన్ షెడ్డును నిర్మించారు. మూత్రశాలలకు 233 చదరపు అడుగులు, వాచ్మెన్ రూంలకు 380 చదరపు అడుగుల స్థలాన్ని కేటాయించారు. ఇవన్నీ కలుపుకొంటే సుమారు ఎకరం స్థలంలో 8,352 చదరపు అడుగుల మేర నిర్మాణ స్థలం అందుబాటులోకి వచ్చింది.