మెదక్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ) : మెదక్ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు నూతన కార్యాలయం ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఎస్పీ కార్యాలయాన్ని అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. గాలి, వెలుతురు, సూర్యరశ్మి వచ్చేలా విశాలమైన గదులతో అందరినీ ఆకట్టుకునేలా అన్ని సౌకర్యాలతో కార్యాలయాన్ని నిర్మించారు. జిల్లాల ఆవిర్భావం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పోలీసు కార్యాలయ భవనాన్ని మంజూరు చేసింది. జిల్లా కేంద్రం ఔరంగాబాద్ శివారులో సర్వే నంబర్ 78లో నూతన కలెక్టరేట్ భవనం పక్కన ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది. ఎస్పీ కార్యాలయ భవనంతో పాటు పోలీసు ఉన్నతాధికారుల నివాస గృహాలను ఒకే ప్రాంగణంలో నిర్మించారు. ముందు ల్యాండ్‌స్కేప్, పార్కింగ్, అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తవగా, ప్రధాన భవన నిర్మాణం అందులోని గదుల తుది మెరుగుల దశలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొత్త జిల్లాల్లో నిర్మించే ఎస్పీ కార్యాలయాలన్నీ దాదాపు ఒకే తరహాలో నిర్మిస్తున్నారు. రూ.38.50 కోట్ల వ్యయంతో 63 ఎకరాల్లో మూడు అంతస్తుల్లో నిర్మించారు.
ఎస్పీ కార్యాలయ భవనానికి రూ.19 కోట్లు…
మిగతా పనులకు రూ.16 కోట్లు..
జిల్లా ఎస్పీ కార్యాలయ భవనానికి రూ.19 కోట్లు మంజూరయ్యాయి. జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయానికి రూ.3.50 కోట్లు, పరేడ్ గ్రౌండ్‌కు రూ.కోటి, ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌కు రూ.5.50 కోట్లు, బ్యారక్‌కు రూ.2.60 కోట్లు, రోడ్లు, తాగునీటి వసతి, విద్యుత్‌కు రూ.6.90 కోట్లు, మొత్తంగా జిల్లా ఎస్పీ కార్యాలయ భవనాలకు రూ.38.50 కోట్లు ప్రభుత్వం కేటాయించింది.
ఎస్పీ కార్యాలయంలో విభాగాలు
గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం 16 విభాగాలుంటాయి. ఎస్పీ, ఏఎస్పీ గదులతో పాటు వారి ఓఎస్డీలు, సీసీలు, పీఆర్వోలకు వేర్వేరుగా గదులుంటాయి. స్టోర్స్, ఇన్, అవుట్ వార్డులతో పాటు పాస్‌పోర్టు విచారణ, ఐటీసీ విభాగాలున్నాయి. రిసెప్షన్‌తో పాటు గ్రీవెన్స్ కోసం ప్రత్యేకంగా హాల్ ఉంది. మొదటి ఫ్లోర్లో పరిపాలనా విభాగంలోని ఆయా సెక్షన్ల సూపరింటెండెంట్లు, వారికి ప్రత్యేకంగా రికార్డు గదులు, మినీ కాన్ఫరెన్స్ హాల్, న్యాయసేవా విభాగం ఇలా అన్నీ కలిసి మొత్తం 21 గదులున్నాయి. ఇందులోనే స్పెషల్ బ్రాంచ్‌కు కేటాయించారు. రెండో ఫ్లోర్లో ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్, సీసీటీఎన్‌ఎస్‌తో పాటు నేర పరిశోధనలోని ప్రత్యేక విభాగాలను కేటాయించారు. ఐటీకోర్, సీఆర్డీ అనాలసిస్, సైబర్‌ల్యాబ్, ఫింగర్ ప్రింట్, క్లూస్‌టీం, డీసీఆర్బీ, రిపోగ్రాఫిక్, పీడీ సెల్, డిజిటల్ శిక్షణ ల్యాబ్‌తో పాటు మహిళా పోలీసు సిబ్బంది, విశ్రాంతి గదులు ఉన్నాయి. టెర్రస్‌పైన కాన్ఫరెన్స్ హాల్, శిక్షణ కేంద్రంతో పాటు ఉద్యోగుల కోసం భోజనశాలలు ఏర్పాటు చేశారు.