సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని మరోసారి రుజువైంది. గత నెలలో కురిసిన అకాల వర్షాలతో రాష్ట్రవ్యాప్తంగా పంటలు దెబ్బతినగా, ఆయా ప్రాంతాల్లో పర్యటించిన సీఎం కేసీఆర్ నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లాలోనూ 4047.28 ఎకరాల్లో 33 పంటలు దెబ్బతిన్నాయి. గ్రామాల్లో పర్యటించిన వ్యవసాయ, ఉద్యానవనశాఖల అధికారులు వరి, మొక్కజొన్న, జొన్నతో పాటు టమాటా, ఉల్లిగడ్డ, మామిడి పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయని గుర్తించి నివేదిక ప్రభుత్వానికి అందజేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ 3093 మంది రైతులకు రూ.4.04 కోట్లు పరిహారం విడుదల చేసి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు. ఇప్పటికే అందరి బ్యాంకు వివరాలు సేకరించిన అధికారులు, త్వరలోనే డబ్బులు వారి ఖాతాల్లో జమ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు అన్నివిధాలా అండగా నిలబడుతున్నారంటూ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– సంగారెడ్డి, (నమస్తే తెలంగాణ), ఏప్రిల్ 22
సంగారెడ్డి, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ) : గతనెలలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు కురవటంతో పంటలు దెబ్బతిన్నాయి. దీంతో ఎకరాకు రూ.10వేలు పంటనష్ట పరిహారం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రైతులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ పంటనష్ట పరిహరం డబ్బులు విడుదల చేశారు. కాగా, సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, అందోలు, సంగారెడ్డి, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లోని 15 మండలాల పరిధిలోని 258 గ్రామాల్లో పంటలు ఎక్కువగా దెబ్బతిన్నాయి. వరి, మొక్కజొన్న, జొన్నతోపాటు టమాట, ఉల్లిగడ్డ, మామిడి తదితర పంటలు దెబ్బతిన్నాయి. 4047.28 ఎకరాల్లో 33 శాతానికిపైగా పంటలు దెబ్బతిన్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. జిల్లా వ్యవసాయ, ఉద్యానవనశాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి పంటనష్టం వివరాలను సేకరించి, ప్రభుత్వానికి అందజేశారు. సీఎం కేసీఆర్ రైతులకు ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డి జిల్లాకు పరిహారం డబ్బులు విడుదల చేశారు.
రూ.4.04 కోట్ల పరిహారం..
సంగారెడ్డి జిల్లాలో 33 శాతానికిపైగా 4047.28 ఎకరాల్లో పంటనష్టం జరిగినట్లు అధికారులు ప్రభుత్వానికి నివేదిక అందజేశారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డి జిల్లాలోని రైతులకు పరిహారం చెల్లించేందుకు ఎకరాకు 10 వేల చొప్పున రూ.4,04,77,000 విడుదల చేసింది. జిల్లాలోని ఎనిమిది మండలాలు 258 గ్రామాల్లోని 3093 మంది రైతులకు ఈ నష్టపరిహారాన్ని రైతుల ఖాతాల్లో నేరుగా పరిహారం డబ్బులు జమ చేయనున్నారు. దీనికి సంబంధించి సోమవారం కలెక్టర్ శరత్ జిల్లా వ్యవసాయ, ఉద్యానవశాఖ అధికారులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది.