బీడు భూములు సస్యశ్యామలమవుతున్నాయి. దశాబ్దాలుగా సాగునీరు లేక కరువుతో కొట్టుమిట్టాడిన అందోల్ నియోజకవర్గంలోని అందోల్, అల్లాదుర్గం, వట్పల్లి, టేక్మాల్ మండలాలు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. వట్పల్లి మండలం సాయిపేట్ శివారులో సింగూర్ బ్యాక్ వాటర్ వద్ద నిర్మించిన తాలెల్మ రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల 14 గ్రామాల రైతులకు వరంగా మారింది. రూ. 36.17 కోట్లతో ఎత్తిపోతలను నిర్మించగా, ప్రత్యక్షంగా 3 వేలు, పరోక్షంగా 10వేల ఎకరాలకు సాగు నీరందుతున్నది.ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఎప్పటికప్పుడు పర్యవేక్షించి త్వరితగతిన పనులు పూర్తిచేయించడంతో గతేడాది జూన్20న మంత్రి హరీశ్‌రావు ఎత్తిపోతలను ప్రారంభించారు. రోజుకు 41.3 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేలా పంప్‌హౌస్ వద్ద 430 హెచ్‌పీ సామర్థ్యంతో నాలుగు మోటర్లను అమర్చి ఏడాదికాలంలో చెరువులన్నీ నింపడంతో మం డుటెండల్లోనూ నిండుకుండలను తలపించాయి. రెండు పంటలకు నీరందడంతో సాగు విస్తీర్ణం పెరిగి దిగుబడి రెట్టింపైంది. ఉమ్మడి రాష్ట్రంలో వర్షాధార పంటలే సాగు చేసుకునేవారమ ని, సీఎం కేసీఆర్ పుణ్యమా అని నేడు సాగునీరు పుష్కలంగా లభించి వ్యవసాయం సంబురంగా చేసుకుంటున్నామని రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
– అందోల్, జూలై 15
అందోల్, జూలై 15: రైతులకు ఉపయోగకరంగా ఉండేలా ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ రూ. 36. 17 కోట్లతో తాలెల్మ రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారు. దీంతో పాడువు భూముల్లో ధాన్యం రాసులు పండుతున్నాయి. అందోల్, అల్లాదుర్గం, వట్పల్లి, టేక్మాల్ మండలాల్లోని 14 గ్రామాలకు సాగు నీరందించే లక్ష్యంతో తాలెల్మ రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు. దీన్ని గతేడాది జూన్ 20న మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. వట్పల్లి మండలం సాయిపేట్ గ్రామ శివారుల్లో సింగూర్ బ్యాక్ వాటర్ వద్ద పంపు హౌస్ నిర్మించి తాలెల్మ గట్టుపై మూడు ఫీడర్లు ఏర్పాటు చేసి, 4 మండలాల్లోని 14 గ్రామాల్లో ఉన్న భూములకు సాగు నీరందిస్తున్నారు. సింగూర్ బ్యాక్ వాటర్ నుంచి 0.117 టీఎంసీల నీటిని ఎత్తిపోతలకు వాడుకుంటున్నారు. సాయిపేటలోని పంపుహౌస్ వద్ద 430 హెచ్‌పీ సామర్థ్యం కలిగిన నాలుగు మోటర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో మోటరు రోజుకు 10 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తున్నది. నాలుగు మోటార్ల ద్వారా రోజుకు 41.3 క్యూసెక్కుల నీటిని ఎత్తిపోసేలా ఏర్పాటు చేశారు. దీంతో ప్రత్యక్షంగా 3 వేల ఎకరాలు, పరోక్షంగా 10 వేల ఎకరాలకు సాగు నీరందుతున్నది.
దశాబ్దాల కల నెరవేరింది..
రైతు సంక్షేమమే ధ్యేయంగా రైతుల కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వం దశాబ్దాల కల నెరవేరింది. బీడుగా మారిన ఆయకట్టు ఎత్తిపోతల పథకంతో సాగులోకి వచ్చింది. ఈ ప్రాంతమంతా భూగర్భ జలాలు కూడా వృద్ధి చెందాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తిపోతలతో అందోల్, వట్పల్లి, అల్లాదుర్గం, టేక్మాల్ మండల్లాలోని చెరువులు నింపి రెండు పంటలకు సాగు నీరందుతున్నది. గతంలో పంట వేయాలంటే ఆకాశం వైపు చూసేవాళ్లు. వర్షంపై ఆధారపడి పంటలు సాగు చేసేవాళ్లు. ప్రస్తుతం నిండుగా ఉన్న చెరువులు, కుంటలను చూసి రైతులు మురిసిపోతున్నారు. నీటి కోసం దిగులు చెందే బాధల నుంచి విముక్తి దొరికిందని రైతులు సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. మంత్రి హరీశ్‌రావు ప్రోత్సాహం, ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ ప్రత్యేక కృషితో రైతుల దశాబ్దాల కల నేరవేరింది. బీడు భూముల్లో పుట్లకొద్ది ధాన్యం పండుతూ రైతుల ముఖాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
ఏండ్ల నాటి కల నెరవేర్చారు
ఏండ్ల తరబడి ఇక్కడి రైతులు పడుతున్న సాగు నీటి కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ వారి కలను నెరవేర్చారు. ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ ప్రాజెక్టులు నిర్మిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం ఖర్చుకు వెనుకాడకుండా ఈ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించింది. దీంతో 4 మండలాల్లోని 14 గ్రామాల్లో సాగు నీరు అందుతున్నది. ఎత్తిపోతలతో ఆయకట్టు భూములకు పుష్కలంగా సాగు నీరందుతున్నదని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎల్లమ్మ ఎత్తిపోతలతో బీడు భూముల్లో పంటలు పండిస్తూ రైతులు సంతోషంగా ఉన్నారు.
– చంటి క్రాంతికిరణ్, ఎమ్మెల్యే అందోల్
రైతులకు ఎంతో ఉపయోగకరం
తాలెల్మ రేణుకా ఎల్లమ్మ ఎత్తిపోతల పథకం రైతులకు ఎంతో ఉపయోగకరంగా మారింది. దీని ద్వారా అందోల్, వట్పల్లి, అల్లాదుర్గం, టేక్మాల్ మండలాల రైతులకు మేలు జరుగుతున్నది. ఇక్కడి రైతుల దశబ్దాల కలను బీఆర్ఎస్ ప్రభుత్వం సాకారం చేసింది. బీడు భూములను సస్యశ్యామలం చేసింది. ఎత్తిపోతల ద్వారా చెరువులు నింపి రెండు పంటలకు సాగు నీరందించడంతో రైతులు మంచి దిగుబడులు సాధిస్తున్నారు.
– లింగాగౌడ్, ఎత్తిపోతలపథకం చైర్మన్