చేర్యాల/మద్దూరు(ధూళిమిట్ట)/ కొమురవెల్లి, నవంబర్ 18 : చేర్యాల పట్టణంలో శనివారం ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ సభ బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆద్యంతం ఫల్ జోష్‌ను నింపింది. ప్రతిపక్ష పార్టీల నాయకుల గుండెల్లో సీఎం కేసీఆర్ సభ గుబులు పుట్టించింది. పుట్టల నుంచి ఉసిళ్లు బయటకు వచ్చినట్లు.. మేడారం సమ్మక్క జాతరకు పోయినట్లు జనమంతా గులాబీ జెండాలు చేతిలో పట్టుకొని చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట, జనగామ, నర్మెట్ట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాల నుంచి డప్పుచప్పుళ్లు,ఆట పాటలతో సందడి చేసుకుంటూ ర్యాలీగా తరలివచ్చారు. చేర్యాల చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలోజనం తండోపతండాలుగా సభకు బారులు తీరారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మండుటెండలను సైతం లెక్క చేయకుండా మధ్యాహ్నం ఒంటి గంటకే అన్ని గ్రామాల నుంచి జనం వివిధ వాహనాల్లో సభాస్థలికి చేరుకున్నారు. కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శించుకుంటూ సభకు వచ్చారు. సీఎం కేసీఆర్ సభకు చేరుకునేంత వరకు కళాకారులు మిట్టపల్లి సురేందర్, దరువు ఎల్లన్న పాడిన పాటలు ప్రజల్లో ఉత్సాహాన్ని నింపాయి. కళాకారుల ఆట పాటలకు అనుగుణంగా బీఆర్ఎస్ కార్యకర్తలు గులాబీ జెండాలు ఊపుతూ డ్యాన్స్ చేశారు. ‘గులాబీల జెండలే రామక్క’, ‘జబ్జకు సంచి చేతుల జెండా’, ‘చంచల్‌గూడ జైలులో చంద్రవంకలు’ తదితర పాటలతో కళాకారులు సభను హోరెత్తించారు.
సీఎం కేసీఆర్ సభకు చేరుకోగానే సభలో గులాబీల పూల వర్షం కురిసింది. ఎటు చూసినా సభమొత్తం గులాబీమయంగా మారింది. సీఎం కేసీఆర్ ప్రసంగానికి సభలోని జనం నుంచి ఆద్యంతం అపూర్వ స్పందన లభించింది. కేసీఆర్ చెప్పిన సామెతలు, విసిరిన చలోక్తులకు సభలోని జనమంతా చప్పట్లతో కేరింతలు కొట్టారు. చేర్యాలను రెవెన్యూ డివిజన్‌గా ప్రకటిస్తానని, చేర్యాలకు ఇంజినీరింగ్ కాలేజీతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించగానే జనం తమ హర్షధ్వానాలతో ‘జై కేసీఆర్’ అంటూ నినదించారు. సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో తెలంగాణలో జరిగిన అభివృద్ధి, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న కుట్రలను విపులంగా చెప్పడంతో సభలోని జనమంతా ఆసక్తిగా ఆలకించారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ఉండాలా.. వద్దా అనే వంటి ప్రశ్నలను వేయడంతో జనం ఉండాలని.. చేతులెత్తి మద్దతు తెలిపారు. సీఎం కేసీఆర్ జనగామ నియోజకవర్గంలోని వివిధ ఊళ్ల పేర్లను ఉటంకించిన సమయంలో ఆయా గ్రామాల ప్రజలు లేసి గంతులేశారు. సీఎం కేసీఆర్‌ను దగ్గర నుంచి చూడాలని కొంతమంది, మరికొంతమంది సీఎం కేసీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. సీఎం కేసీఆర్ సభ పూర్తవ్వగానే సభలో పటాకుల మోతలు మోగాయి. సీఎం కేసీఆర్ సభ విజయవంతం కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.