సిద్దిపేట, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఒకనాడు మెతుకుసీమ అంటే రైతుల ఆత్మహత్యలు…! నెర్రెలు బారిన, బీడు భూము లు, ఎండిన చెరువులు…! చుక్క నీటి కోసం వందల ఫీట్ల లోతుకు బోర్లు వేసినా చుక్క కానరాక పోయేది. ఒక్కో రైతు పదుల సంఖ్యలో బోర్లు వేసేవారు. చివరికి అప్పుల బాధతో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.అత్యధిక రైతు ఆత్మహత్యలు ఉమ్మడి మెదక్ జిల్లాలోనే అయ్యేవి. గత ప్రభుత్వాల హయాంలో ఉమ్మడి మెదక్ జిల్లాలో కనీసం ఒక్క ప్రాజెక్టు నిర్మాణం చేయకపోవడమే గాక తట్టెడు మట్టి ఎత్తిన పాపాన పోలేదు. అడుగంటిన భూగర్భ జలాలతో రైతులు అరిగోస పడ్డారు.బోరు, బావులు, వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేశారు. పంట చేతికందే సమయంలో ఏదో ఒక రూపంలో దిగుబడి ఆశించినం త రాకపోయేది. వచ్చిపోయే కరెంట్‌తో మోటర్లు కాలేవి, సాగు పెట్టుబడి అధికంగా ఉండేది.రైతుల బాధలను ఆనాటి ప్రభుత్వాలు అవహేళన చేశా యి. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రైతులకు అన్నీ కష్టాలే… పంట చేతికొచ్చే వరకు రైతుకు ఆశలు ఉండేవి కావు. వచ్చిపోయే కరెంట్, కాలిపోయే మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లతో రైతుకు పెట్టుబడి తడిసిమోపెడయ్యేది. పంట చేతికందే సమయానికి నీరందక బోరు బావులను తవ్వేవారు. ఒక్కో రైతు 800 ఫీట్లకు పైగా బోరు వేసినా చుక్క నీరు రాకపోవడంతో అప్పుల పాలయ్యేవారు. ఇవన్నింటినీ ఆలోచించి రైతులు ఆత్మహత్యలకు పాల్పడేవారు. గత ప్రభుత్వాల హయాంలో సిద్దిపేట డివిజన్లోని సిద్దిపేట,దుబ్బాక, గజ్వేల్ నియోజకవర్గాల్లో రైతు ఆత్మహత్యలు అధికంగా ఉండేవి. ప్రతి రైతు ఆత్మహత్య వెనుక ఆర్థిక ఇబ్బందులు, అప్పులు ఉండేవి. బోర్లు వేసి బొక్కబోర్లపడేవారు. ఆకలి చావులు ఉండేవి.
పశువులకు పశుగ్రాసం కూడా దొరకలేదు ఇవన్నీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇవాళ స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేశారు.గల గల పారేటి గోదావరి నీళ్లను బీడు భూములకు మళ్లించారు. పెద్ద ఎత్తున ప్రాజెక్టులు నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో వందలాది చెరువులు, చెక్‌డ్యామ్‌లను మండుటెండల్లోనూ నింపారు. ఎక్కడో పుట్టిన గంగమ్మను రంగనాయక, మల్లన్నసాగర్ రిజర్వాయర్లను నింపుకుంటూ 618 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ రిజర్వాయర్‌లోకి తీసుకువచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో గోదావరి జలాలు పారి పచ్చని పంటలతో మెతకు సీమకు పూర్వవైభవం వచ్చింది. రాళ్లు రప్పల భూముల రూపురేఖలు మారిపోయి పచ్చని మాగాణిల్లాగా విలసిల్లు తూ సిరుల పంటలు పండుతున్నాయి. ఈ ప్రాంతం వాళ్లకే కూలి పని దొరకని పరిస్థితుల నుంచి ఇతర రాష్ర్టాల కూలీలకు పనులు కల్పించే స్థాయికి వ్యవసాయం అద్భుతంగా ఎదిగింది.ఆనాటి పాలకులు వ్యవసాయానికి దొంగరాత్రి కరెంట్ ఇచ్చి పంటలు ఎండబెట్టిన పరిస్థితిని కళ్లారా చూశాం. ఇవాళ 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించడమే గాకుండా రెండు పంటలకు సాగు నీరు అందుతున్నది.పంట పెట్టుబడి కింద రైతు బంధు, ఏ కారణం చేత రైతు చనిపోయిన ఆకుటుంబానికి రైతు బీమాతో భరోసా ఇచ్చింది.దీంతో ఇవాళ భూమికి బరువయ్యేలా పంటలు పండుతున్నాయి. రైతులు పండించిన పంటను చివరి గింజ వరకు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రైతుల ఖాతాలో డబ్బులను నేరుగా జమచేస్తున్నది.
రైతు బంధు ప్రారంభించి నాటి నుంచి నేటి వరకు అనగా (మొదటి నుండి 11వ విడత వరకు) సిద్దిపేట జిల్లాలో 29,33,494 మంది రైతులకు రూ. 3,124.82 కోట్లు, మెదక్ జిల్లాలో 24,69,637 రైతులకు రూ.2,027.37 కోట్లు, సంగారెడ్డి జిల్లాలో 31,95,960 మంది రైతులకు రూ.3,619.54 కోట్లు, మొత్తం ఉమ్మడి జిల్లాలో 85,99,091 మంది రైతులకు రూ. 8,771.73 కోట్లు రైతుల బ్యాంకు ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది.
సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో సన్న, చిన్న కారు రైతులే అధికంగా ఉన్నారు. రైతు బీమా ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు ఉమ్మడి మెదక్ జిల్లాలో16,061 మంది రైతు కుటుంబాలకు రూ. 803. 05 కోట్లు అందించింది. ఒక్కో కుటుంబానికి రూ. 5లక్షల చొప్పున నేరుగా రైతు నామిని ఖాతాలోనే జమ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో పల్లె జీవన వ్యవస్థ పూర్తిగా మారింది. పట్టణాలకన్నా పల్లెల్లోనే ఉండడానికి ప్రజలు ఎక్కువ ఇష్టపడుతున్నారు. గ్రామాల్లోనే హైటెక్ హంగులతో ఇండ్లను కట్టుకుంటున్నారు. పట్నాల్లో ‘టూలెట్’ బోర్డులు దర్శనమిస్తున్నాయి.సాగు విస్తీర్ణం పెరగడంతో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు మంచి గిరాకీ పెరిగింది. ప్రధానంగా ట్రాక్టర్లకు ఫుల్ గిరాకీ ఉంది. వరి కోత మిషన్లు, నీళ్లల్లో నడిచే వరికోత మిషన్లు ఇలా అన్ని రకాల మిషన్లకు డిమాండ్ ఉంది. వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతుండడంతో రైతులతో పాటు ట్రాక్టర్లు కొనుగోలు చేసిన యజమానులు, దానిపై పనిచేసే కార్మికులు, ట్రాక్లర్ గ్యారేజీలకు ఫుల్‌గా పని ఉంది.
కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతుల్లో నూతనోత్తేజం వచ్చింది. సాగునీరు లేక రైతులు ఇన్నాళ్లు అల్లాడిపోయారు. ఎక్కడో పుట్టిన గోదారమ్మను అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ మీదుగా కొండపోచమ్మ వరకు నీళ్లు తీసుకువచ్చిన భగీరథుడు సీఎం కేసీఆర్. అన్నపూర్ణ, రంగనాయకసాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మకు గోదావరి జలాలు వస్తుండడంతో కాల్వల ద్వారా చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌లు నిండి వాటి పరీవాహక ప్రాంతాల్లో గణనీయంగా భూగర్భజలాలు పెరిగాయి. మండు వేసవిలో సైతం చెరువులు, చెక్‌డ్యామ్‌లు నిండుకుండలా ఉన్నాయి. ఇవాళ రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు సంబురంగా సాగు చేస్తున్నారు.తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు తగ్గాయి.
ఒకప్పుడు తాగునీళ్లు, సాగునీళ్లు లేక కరువు కాటకాలకు నిలయంగా ఉన్న ఉమ్మడి మెదక్ జిల్లా ఇవాళ గోదావరి నీళ్లతో ఈ ప్రాంతం సస్యశ్యామలమైంది. సంబురంగా ఎవుసం చేసుకుంటున్నారు.రైతులకు దన్నుగా సీఎం కేసీఆర్ నిలుస్తున్నారు. ఎక్కడో పుట్టిన గోదావరిని జిల్లాకు తీసుకవచ్చి బీడు భూముల్లో పారించడంతో పచ్చని పంట పొలాలతో జిల్లా కోనసీమను తలపిస్తున్నది.ఇవ్వాళ పల్లెల్లో ఎక్కడ చూసినా ధాన్యపు రాశులు కనిపిస్తున్నాయి. రైతులకు రైతుబంధు, రైతుబీమా, నిరంతర విద్యుత్, సాగునీరు ఇవన్నీ రైతులకు కలిసి వస్తున్నాయి.పండిన పంటను రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగుకుండా రైతు ముంగిటలోనే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాలను ఏర్పాటు చేసి కొనుగోలు చేస్తుంది.
గత ప్రభుత్వాల హయాంలో సాగు నీళ్లు లేక ఎవుసాలు పడావు ఉండే..ఊరిలో పనిలేక పట్నం, భీమండి తదితర పట్టణాలకు వలస వెళ్లి ఏదో కూలి పని చేసి జీవనం గడిపేవారు. ఇంకొందరు హైదరాబాద్‌లోని బేగంపేట, పాటిగడ్డలో చుడువ, పల్లీలు తయారు చేసి అమ్ముకుంటూ కుటుంబాలను పోషించుకున్నారు. ఇదంతా నాటి పాలకుల పుణ్యం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత సాగు నీరు రావడంతో ఎటు చూసినా పచ్చని పంట పొలాలతో కోనసీమను తలపిస్తున్నాయి. ప్రతి ఎకరాకు సాగు నీరందించాలనే సీఎం కేసీఆర్ సంకల్పంతో రికార్డుస్థాయిలో ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా జిల్లాలో అన్నపూర్ణ, రంగనాయక, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్లు, సింగూరు, వనదుర్గ ప్రాజెక్టులతో సాగు విస్తీర్ణం పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం సాగు నీరు అందించడంతో పాటు రైతులకు పంట పెట్టుబడిసాయం, సకాలంలో ఎరువులు, విత్తనాలను అందుబాటులో ఉంచడం, రైతు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయడంతో రైతులు సంతోషంగా ఎవుసం చేసుకుంటున్నారు.అన్ని వర్గాల వారికి చేతినిండా పని దొరకుతున్నది. ఇవాళ ఇతర రాష్ర్టాల నుంచి ఇక్కడికి కూలీలు పెద్దఎత్తున వచ్చి పనులు చేసుకుంటున్నారు. వరి నాటు నుంచి వరి కొత వరకు అన్ని పనుల్లో వారు నిమగ్నమవుతున్నారు. రైస్‌మిల్లులు, ఇతర పరిశ్రమల్లో కూడా ఇతర రాష్ర్టాల నుంచి వచ్చి కూలీలు పనులు చేస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ తదితర రాష్ర్టాల నుంచి పనుల కోసం కూలీలు ఇక్కడి వచ్చి తమ జీవనం సాగిస్తున్నారు. పెద్దసంఖ్యలో ఇతర రాష్ర్టాల నుంచి వరి కోత యంత్రాలు ఇక్కడి వచ్చాయి.వ్యవసాయాధారిత పరిశ్రమల్లో కార్మికులకు మస్తుగా పనిదొరుకుతున్నది.