మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 23: స్వరాష్ట్రంలో మన ప్రగతికి తార్కాణం కలెక్టరేట్ సముదాయమని, కొన్ని రాష్ర్టాల సచివాలయాల కంటే మన కలెక్టరేట్లే పెద్దవని ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్‌రావు అన్నారు. మెదక్ జిల్లాకేంద్రంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కాంప్లెక్స్ భవనాన్ని బుధవారం ప్రారంభించారు. అనంతరం జిల్లా అధికారులు, ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ తెలంగాణ వస్తే పాలన చేతగాదు అని ఎద్దేవా చేసినోళ్లు ఈరోజు మన అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారన్నారు. అభివృద్ధికి కొలమానంగా భావించే తలసరి ఆదాయం, జీడీపీ, తలసరి విద్యుత్ వినియోగంలో మనమే నంబర్ వన్‌గా ఉన్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం అనతికాలంలోనే అభివృద్ధి చెందిందని.. 60, 70 ఏండ్ల క్రితం ఏర్పాటైన ఇతర రాష్ర్టాలతో పోల్చితే తెలంగాణలో అభివృద్ధి గణనీయంగా జరిగిందన్నారు. కేవలం తొమ్మిదిన్నర ఏండ్లలోనే రాష్ర్టాన్ని ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకునే స్థాయికి ఎదిగిందన్నారు. కొన్ని రాష్ర్టాల్లో సరైన అసెంబ్లీ, సచివాలయాలు సైతం లేవన్నారు. మనం 33 జిల్లాలను ఏర్పాటు చేసుకున్నాం, ఇప్పడు 24వ కలెక్టరేట్‌ను సైతం ప్రారంభించుకోవడం చాలా సంతోషంగా ఉందని కేసీఆర్ అన్నారు. నూతన కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాన్ని నిర్మించుకున్నదుకు మెదక్ జిల్లా ప్రజలకు కేసీఆర్ అభినందనలు తెలియజేశారు. మెదక్ కలెక్టరేట్ ఆర్కిటెక్చర్ ఉషారెడ్డి మన తెలంగాణ బిడ్డేనని కేసీఆర్ ఆమెను అభినందించారు. అన్ని జిల్లాల్లో నిర్మించుకున్న ఈ పరిపాలన భవనాలను చూస్తే మన రాష్ట్ర అభివృద్ధి గురించి తెలిసిపోతుందన్నారు. దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్ రాష్ట్రంగా ఉన్నదని, స్వచ్ఛమైన నీటిని ఇంటింటికీ అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమేనని సీఎం చెప్పారు. అలాగే అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని వెల్లడించారు. గతంలో 23 లక్షలు మాత్రమే పింఛన్‌దారులు ఉండేవారని, ప్రస్తుతం 54 లక్షలు ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడగానే మరింత పింఛన్ పెంచుతామన్నారు. ఘణపురం ఆయకట్టును ఎలా బాగు చేసుకున్నమో మన అందరికి తెలుసన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర లిప్ట్‌లను త్వరలో పూర్తి చేస్తామన్నారు. మంజీరాలో అనేక చెక్ డ్యామ్‌లు నిర్మించుకున్నామని, తద్వారా 365 రోజులు మంజీరా జలకళను సంతరించుకొని పచ్చని పంటలతో మెదక్ అలరాలుతుందన్నారు. రాను న్న రోజుల్లో జిల్లాను మరింత అభివృద్ధి చేస్తామని సీఎం పేర్కొన్నారు.
కలెక్టర్‌ను కుర్చీలో కూర్చోబెట్టి..
ముఖ్యమంత్రి కేసీఆర్ మధ్యాహ్నం 3.32 గంటలకు సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించిన అనంతరం అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. కలెక్టరేట్ ప్రవేశ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్వమత ప్రార్థనలు చేశారు. అనంతరం కలెక్టర్ చాంబర్లో కలెక్టర్ రాజర్షిషాను కుర్చీలో కూర్చోబెట్టి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. కలెక్టర్ సీఎం కేసీఆర్‌ను, ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారిని శాలువాతో సత్కరించి మెమోంటోలను బహూకరించారు.
స్వరాష్ట్రంలో 24 కలెక్టరేట్లను ప్రారంభించుకున్నాం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి
స్వరాష్ట్రంలో ఇప్పటివరకు 23 కలెక్టరేట్లను ప్రారంభించుకున్నామని, మెదక్‌తో 24 పూర్తయ్యాయని ప్రభుత్వ ప్రధానకార్యదర్శి శాంతికుమారి అన్నారు. కలెక్టరేట్ల నిర్మాణంతో అన్నిసేవలు ఒకేచోట లభిస్తాయని, మెదక్ జిల్లాలో వివిధ హోదాల్లో నాలుగేండ్లు పని చేశానని సీఎస్ గుర్తు చేశారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ఆగ్రస్థానంలో నిలిచిందని, తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు. ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ స్టేట్‌గా తెలంగాణ నిలిచిందన్నారు. తెలంగాణ ప్రత్యేక ఇంక్రిమెంట్, రెండుసార్లు వేతన సవరణ, వీఆర్ఏలకు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పేస్కేల్ అమలుచేయడం, పెద్దఎత్తున పంచాయతీ సెక్రటరీల నియామకం, జేపీఏల క్రమబద్ధీకరణతోపాటు అనేక కార్యక్రమాలు ఉద్యోగుల కోసం ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. అనంతరం సీఎం కేసీఆర్‌తో కలిసి అధికారులు గ్రూప్ ఫొటో దిగారు. సమావేశంలో ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, రోడ్లు భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌రెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతలక్ష్మారెడ్డి, ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శేరి సుభాష్‌రెడ్డి, యాదవరెడ్డి, జడ్పీ చైర్పర్సన్ హేమలతాశేఖర్‌గౌడ్, మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ రోహిణిప్రియదర్శిణి, ఆదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్ తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు.