చేర్యాల, ఫిబ్రవరి 23 : కొమురవెల్లి మల్లికార్జునస్వామి వారి పుట్టినరోజు సందర్భంగా బుధవారం మల్లన్న ఆలయ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో ఏకంగా ముఖ్యమంత్రి కేసీఆర్ స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడంతో కొమురవెల్లి మల్లన్న భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పాతాళంలో ఉన్న గోదావరి జలాలను తీసుకొచ్చి మల్లన్నకు అభిషేకం చేస్తామని.. మల్లన్నసాగర్ రిజర్వాయర్ శంకుస్థాపన సందర్భంగా ఇచ్చిన హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకున్నారు. రిజర్వాయర్‌ను జాతికి అంకితం చేసిన రోజునే సీఎం కేసీఆర్ మల్లన్న ఆలయానికి వచ్చి స్వామి వారికి ఐదు రాగి బిందెలతో తీసుకొచ్చిన గోదావరి జలాలతో అభిషేకం చేశారు. మల్లన్న క్షేత్రానికి వచ్చిన సీఎం కేసీఆర్‌కు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, ఆలయ ఈవో బాలాజీ, ఆలయ చైర్మన్ గీస భిక్షపతితో కలిసి ఆలయ అర్చకులు, ఒగ్గు పూజారులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం సీఎం కేసీఆర్.. రాష్ట్ర మంత్రులు తన్నీరు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ సంతోశ్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, జడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణశర్మతో కలిసి ఆలయంలోకి వెళ్లారు. మల్లన్నసాగర్ నుంచి తెచ్చిన ఐదు బిందెల గోదావరి నీటికి అర్చకులు ప్రత్యేక పూజలు చేయగా, సీఎం కేసీఆర్ వాటిని అర్చకులకు అందజేశారు. పూజల అనంతరం సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు ఆశీస్సులు అందజేయడంతోపాటు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, చేర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేశంగౌడ్, ఎంపీపీ కీర్తనాకిషన్, జడ్పీటీసీ, నాయకులు పాల్గొన్నారు.