‘కరోనా కారణంగా ప్రజలను కలవలేకపోయా. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కాగానే నెలలో ఒకరోజు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలతోనే ఉంటా. గజ్వేల్ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం’.. అని సీఎం కేసీఆర్ అన్నారు. గజ్వేల్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని శుక్రవారం మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా అంతాయిపల్లి ఎస్ఎన్ఆర్ గార్డెన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సీఎం కేసీఆర్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. గజ్వేల్‌లో ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా తాగునీళ్లు అందిస్తున్నట్లు తెలిపారు. రాష్ర్టానికి తలమానికంగా గజ్వేల్ అభివృద్ధి జరుగుతున్నదని, నాయకులు సూచించిన పనులు తప్పకుండా పూర్తిచేసే బాధ్యత తనదే అని సీఎం కేసీఆర్ కార్యకర్తలకు భరోసా ఇచ్చారు.25 ఏండ్ల క్రితం ప్రజల కష్టాలను చూసి గడిచిన రోజులు గుర్తుకొస్తే చాలా బాధ అనిపించినా,అప్పట్లో ఏమీ చేయలేని పరిస్థితులు ఉండేవన్నారు. నేడు 24గంటల కరెంట్, రైతుబంధు, రైతుబీమా, పంట రుణమాఫీని పకడ్బందీగా అమలు చేస్తున్నామని చెప్పారు. కరోనా, నోట్ల రద్దుతో చాలా దెబ్బతిన్నామని, రాష్ట్ర ఆదాయం పడిపోయిందని గుర్తుచేశారు. పదవులు వస్తాయి పోతాయి కానీ..కరోనా టైంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకున్నదన్నారు.
సిద్దిపేట (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ గజ్వేల్, అక్టోబర్ 20: గజ్వేల్ అభివృద్ధ్ది ఎంతో జరిగిందని మీరే అంటే గజ్వేల్‌కు దిష్టి తగులుతుంది. గజ్వేల్‌లో ఇంకా చాలా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నాదే. కరోనా కారణంగా ప్రజలను కలవలేకపోయా. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పాటు కాగానే నెలలో ఒకరోజు గజ్వేల్ నియోజకవర్గ ప్రజలతోనే ఉంటా’.. అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు. శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అంతాయిపల్లి ఎస్ఎన్ఆర్ గార్డెన్లో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం కేసీఆర్ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 25 ఏండ్ల క్రితం ప్రజలు కష్టాలను చూసి ఎంతో బాధతో గడిపిన రోజులు గుర్తుకొస్తే చాలా బాధ అనిపించినా ఏమి చేయలేని పరిస్థితిలు ఉండేవన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సిద్దిపేటలో కరెంట్ బాధలు చూసి అధికారుల దృష్టికి తీసుకెళ్తే, అధికారులు సీఎంతోనే సమస్యలు పరిష్కారం అవుతాయని చెప్పారన్నారు.
అలాంటి పరిస్థితుల నుంచి నేడు తెలంగాణలో రైతులకు నాణ్యమైన 24గంటల కరెంట్ ఇచ్చే స్థాయికి ఎదిగామన్నారు. 1999లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఉన్నపలంగా విద్యుత్ చార్జీలను పెంచి ఏడాదికి 15శాతం పెంచుతామని తెలపడంతో వెంటనే తాను బహిరంగ లేఖను రాశానన్నారు. కరెంట్ అడిగిన కారణంగా రైతులకు చంపేస్తుంటే సమైక్య పాలనలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందని, న్యాయం జరగాలని కోరితే కాల్పులు జరిపి చంపారన్నారు. ఆనాడు ఎన్నో అవస్థలతో దిగజారిన తెలంగాణలో అవరోధాలను అధిగమించినట్లు చెప్పారు. కరెంట్‌పై రాస్తే రామాయణం రాసుకోవచ్చని సీఎం కేసీఆర్ అన్నారు. అప్పట్లో లంచం ఇస్తేనే పనులు జరిగేవని గుర్తుచేశారు. కానీ, నేడు తెలంగాణలో ఇస్తున్న నాణ్యమైన కరెంట్‌లో వైండింగ్ చుట్టుకునే పనులు లేకుండా పోయిందని, తెలంగాణ మొత్తం ఇదే పరిస్థితి కనిపిస్తున్నదన్నారు.
‘గజ్వేల్ అభివృద్ధి చాలా జరిగిందని మాట్లాడుతున్నారు. అదికాదు. గజ్వేల్ అభివృద్ధి ఇంకా చాలా జరగాల్సి ఉంది. అభివృద్ధి జరిగిందంటే దిష్టి తగులుతది. గజ్వేల్ అభివృద్ధ్దిలో సాధించిన దానికి సంతృప్తి జరగాలి’.. అని సీఎం కేసీఆర్ అన్నారు. గజ్వేల్‌లో ఇంటింటికీ మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్లు అందించామని, తెలంగాణలోని గ్రామాలో 34వేల మంచినీటి ట్యాంకుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ప్రజలకు మంచినీళ్లను అందించాలనే ఉద్దేశంతో కోమటిబండ వద్ద నిర్మించిన మిషన్ భగీరథ ట్యాంకుల ద్వారా గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గాలకు ప్రతిరోజు శుద్ధిచేసిన నీళ్లను అందించే కార్యక్రమానికి శ్రీకా రం చుట్టినట్లు చెప్పారు. గ్రావిటీ ద్వారా నీటి పంపిణీ చేయడంతో విజయవంతమైందన్నారు. సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నీటి సమస్యను తీర్చేందుకు లోయర్ మానేరు డ్యాంలో 200మీటర్ల లోతుకు వరకు బోర్లు వేసి గుట్టపై నుంచి నీటిని పంపిణీ చేశామని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు.
కరోనా, నోట్ల రద్దుతో చాలా దెబ్బతిన్నామని, రాష్ట్ర ఆదాయం పడిపోయిందని, కరోనాతో కేంద్ర ప్రభుత్వం చాలా బయపెట్టిందని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ ప్రభావం వ్యవసాయంపై పడవద్దనే ఉద్దేశంతో రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. పదవులు వస్తాయి పోతాయని, కానీ.. రైతులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగకూడదనే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు రైతుల జీవనోపాధి మీద ప్రభావం పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుందన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంతో హల్దీ, కూడవెళ్లి వాగుల ప్రవాహంతో వేసిన పంటను దక్కించుకొవాలనే కాళేశ్వరం నీళ్లను వదలడంతో పంటలు పుష్కలంగా పండుతున్నట్లు చెప్పారు. ఆనాడు దొంగల భయం ఎక్కువగా ఉండేదని, వాటిని గుర్తుచేసుకుంటేనే దుఃఖం వస్తాదన్నారు. రైతులు నిర్ధిష్టంగా పంటలు పండించుకోవాలని సీఎం కేసీఆర్ సూచించారు.
తాను ముంపు గ్రామాలకు చెందిన బాధితుడినే అని, తనకు అన్ని బాధలు తెలుసని సీఎం కేసీఆర్ అన్నారు. వేములఘాట్‌కు చెందిన ఒకరు తమ బాధలు తీర్చాలని ఇప్పుడే ఫిర్యాదు ఇస్తే చదివానని, తప్పకుండా ఎన్నికల తరువాత ముంపు గ్రామాలందరితో ఒకరోజు గడిపి వారి బాధలు తెలుసుకొని అన్నింటినీ తీర్చుతానని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తమకున్న రెండెకరాల భూమి మిడ్‌మానేరులో ముంపునకు గురైందని, మా ఊరుతో పాటు మా అత్తగారి ఊరు కూడా ప్రాజెక్టు నిర్మాణంలోనే పోయాయని, నేను చూశాను కాబట్టి మీ బాధలు అన్నీ తెలుసని, తప్పకుండా అన్నింటినీ తీర్చుకుందామని వారికి సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు. మీ పుణ్యంతోనే 50 టీఎంసీల మల్లన్నసాగర్, 15టీఎంటీల కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును నిర్మించుకోవడంతో పాత మూడునాలుగు జిల్లాలకు సాగు, తాగునీరు అందుతున్నట్లు చెప్పారు. సింగూరు, జహీరాబాద్ వరకు నీళ్లను అందించేలా ప్రాజెక్టును కట్టుకున్నట్లు చెప్పారు.
తాను కూడా రైతునేనని, ఎర్రవల్లిలో 27బోర్లు వేస్తే మూడు బోర్లలోనే నీళ్లు పడిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ప్రాజెక్టుల నిర్మాణంతో ఆరున్నర ఫీట్ల ఎత్తుకు భూగర్భ జలమట్టం పెరిగిందన్నారు. అక్కడే ఉన్న బందారం, అంకిరెడ్డిపల్లి గ్రామాలకు చెందిన కార్యకర్తలు తమ ఊర్లకు కాళేశ్వరం జలాలు రావాలని కోరితే తప్పకుండా వస్తాయని సీఎం భరోసా ఇచ్చారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి నీళ్లను తెచ్చే బాధ్యత తనదే అన్నారు. మొదటి దశలో కొంతవరకు వచ్చాయని, పూర్తిస్థాయిలో త్వరలోనే లిఫ్ట్ ద్వారా అన్ని గ్రామాలకు బ్రహ్మాండంగా గోదావరి జలాలను తీసుకు వస్తామని హారీ ఇచ్చారు. జగదేవ్‌పూర్ మండలంలోని అన్ని గ్రామాలకు నీళ్లను తీసుకు వస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.
గజ్వేల్, అక్టోబర్ 20: సీఎం కేసీఆర్‌కు ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి వేంకటేశ్వరస్వామి ప్రతిమను అందజేశారు. అంతకు తూప్రాన్ మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల మంజూరుతో పాటు ఆర్అండ్ఆర్ కాలనీలో సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ దేవీరవీందర్, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, మండల అధ్యక్షుడు బెండె మధు, మర్కూక్ కరుణాకర్‌రెడ్డి నాగలిని సీఎం కేసీఆర్‌కు బహూకరించారు.
తెలంగాణ అభివృద్ధి ఆగదని, ఇంకా జరగాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పటికే ప్రతి ఇంటికీ తాగునీళ్లు ఇస్తున్నామన్నారు. సాగునీళ్లను అందించే బృహత్తర కార్యక్రమం విజయవంతం అవుతున్నదన్నారు. 24 గంటల నాణ్యమైన కరెంట్‌ను అందించడంతో నేడు రైతులు సంతోషంతో పంటలు పండించుకుంటున్నట్లు చెప్పారు. అందరికీ ఇల్లు రావాలని, ఇవన్నీ కావాలంటే తప్పకుండా మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని, అందుకు ప్రతి ఒక్కరూ కష్టపడి మంచి మెజార్టీని తీసుకరావాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 95 నుంచి 105 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. రాష్ర్టానికి తలమానికంగా గజ్వేల్ అభివృద్ధి జరుగుతుందని, నాయకులు సూచించిన హామీలను తప్పకుండా నెరవేర్చే బాధ్యత తనదే అని సీఎం కేసీఆర్ భరోసా ఇచ్చారు.