-సంగారెడ్డి, సెప్టెంబర్ 14; టీఎస్ ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి కాపాడడంతో పాటు ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు ప్రాధాన్యమిస్తూ సీఎం కేసీఆర్ అనేక చర్యలు తీసుకున్నారు. గత ఉమ్మడి ప్రభుత్వాలు సంస్థను ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు చేయగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆర్టీసీని ప్రభుత్వ రంగ సంస్థగా గుర్తించేందుకు విలీన ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. నెలరోజుల క్రితం శాసనసభలో తీర్మానం చేసి గవర్నర్‌కు పంపగా, గురువారం గవర్నర్ ఆమోదం తెలుపుతూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి మెదక్ జిల్లా రీజియన్‌లోని ఎనిమిది డిపోల్లో విధులు నిర్వహిస్తున్న 2336 మంది సిబ్బందికి లబ్ధి చేకూరనున్నది. సంస్థ ఆర్థికంగా నష్టాల్లో ఉన్నప్పటికీ ఉద్యోగులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఇప్పటివరకు సర్కార్ ఎనిమిది సార్లు డీఏలను పెంచింది. తాజాగా తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తున్నట్లు ప్రకటన వెలువడడంతో సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. భవిష్యత్తులో కష్టపడి పనిచేసి ఆర్టీసీని మరింత లాభాల బాటలోకి తెచ్చేందుకు కృషి చేస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
-సంగారెడ్డి, సెప్టెంబర్ 14
సంగారెడ్డి, సెప్టెంబర్ 14: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు అడ్డంకులు తొలిగిపోయాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం నెల రోజుల క్రితం జరిగిన వర్షాకాల సమావేశాల్లో బిల్లు ఆమోదించి, గవర్నర్ ఆమోదానికి పంపించింది. గురువారం గవర్నర్ ఆర్టీసీ విలీనానికి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆర్టీసీ కార్మికులు సంబురాల్లో మునిపోయారు. ఆర్టీసీ సంస్థను కాపాడుకునేందుకు సీఎం కేసీఆర్ ఇప్పటికే అనేక మార్లు ప్రత్యేక నిధులు కేటాయించి, లాభాల బాటలోకి తీసుకువచ్చేందుకు అనేక చర్యలు తీసుకున్నారు. ఆర్టీసీలో వస్తున్న మార్పులతో ప్రజల్లోనూ ఆదరణ పెరిగింది. ప్రస్తుతం ప్రభుత్వంలో ఈ సంస్థను విలీనం చేయడంతో కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నారు.
ఉమ్మడి జిల్లా మెదక్
రీజియన్‌లో 2336 మందికి లబ్ధి..
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం ద్వారా ఉమ్మడి జిల్లా మెదక్ రీజియన్‌లో విధులు నిర్వహిస్తున్న 2336 మందికి లబ్ధి చేకూరనున్నది. ఉమ్మడి జిల్లాలో 8 డిపోల్లో విధులు నిర్వహిస్తున్న ఆర్టీసీ కార్మికులు, సిబ్బందికి ప్రభుత్వం ప్రకటనతో భరోసా కల్పించింది. విలీనం ద్వారా వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నారు. సర్కారు కొలువులో ఉన్న వారికి అందే బెనిఫిట్స్ వారికి వర్తించనున్నాయి. ఆర్టీసీని కాపాడుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను చేపడుతున్నది. ప్రధాన పండుగలు, శుభకార్యాలకు బస్సులు అద్దెకు ఇవ్వడం, యాత్రలకు ప్రత్యేక బస్సులు నడపడం, ఇటీవల రాఖీ పౌర్ణమికి ప్రత్యేక బస్సులు నడిపి ఆర్టీసీ ఆదాయాన్ని మరింత పెంచిన విషయం విధితమే. ప్రభుత్వ నిర్ణయంతో ఆర్టీసీ ఉద్యోగుల్లో సంతోషం తాండవిస్తున్నది.
ఉద్యోగుల శ్రేయస్సుకు పనిచేస్తున్న యాజమాన్యం…
ఆర్టీసీ సంస్థ ఆర్థికంగా క్లిష్టపరిస్థితిలో ఉన్నా తాజా కరువు భత్యంతో కలిపి 8 డీఏలను మంజూరు చేసినట్లు సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాలతో అధికారులు ప్రకటించారు. ఏకంగా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయంతో శాసనసభలో ఆమోదించి గవర్నర్ ఆమోదానికి పంపించారు. నెలరోజులుగా ప్రభుత్వ నిర్ణయంపై గవర్నర్ సందేహాలను క్షణ్ణంగా పరిశీలించిన ఆమోదం తెలుపుతూ ఆదేశాలిచ్చారు. ఇప్పటికే ఆర్టీసీ యజమాన్యం ఉద్యోగులకు డీఏను పెంచి ఆదుకుంటుండగా, గవర్నర్ తీర్మానాన్ని ఆమోదించి ఉత్తర్వులు జారీ చేయడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చాలా సంతోషంగా ఉంది..
నేను 21 ఏండ్ల నుంచి జహీరాబాద్ ఆర్టీసీలో కండక్టర్‌గా పని చేస్తున్నా. అప్పటి నుంచి ఎన్ని పార్టీలు వచ్చినా మా గురించి పట్టించుకోలేదు. కానీ, సీఎం కేసీఆర్ మాత్రమే ఆర్టీసీ కార్మికులు వారి కుటుంబాల కోసం మంచి నిర్ణయం తీసుకున్నారు. మమల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.
– దౌలయ్య, ఆర్టీసీ కండక్టర్ బిలాల్పూర్, కోహీర్ మండలం
విలీన ప్రక్రియ వేగవంతం చేయాలి…
ప్రభుత్వం ఆర్టీసీని విలీనం చేస్తూ శాసనసభలో తీర్మానం చేసి గవర్నర్ ఆమోదానికి పంపిన నెల రోజులకు ఆమోదం తెలుపడం సంతోషకరం. ప్రభుత్వం వెంటనే విలీన వీధి విధానాలను ఖరారు చేసి ఉద్యోగుల ఆశలు నిలబెట్టాలి. సీసీఎస్, పీఎఫ్ డబ్బులు త్వరగా చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. ఆర్టీసీ అభివృద్ధికి ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించిన రూ.1500 కోట్లను విడుదల చేసి ఆర్టీసీ నష్టాన్ని భర్తీ చేయాలి. రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలి. విలీనం చేసిన సీఎం కేసీఆర్‌కు ఆర్టీసీ ఉద్యోగులందరూ రుణపడి ఉంటాం.
– పల్లె కృష్ణమూర్తి, టీఎస్ఎంయూ రాష్ట్ర కార్యదర్శి
గవర్నర్ ఆమోదం సంతోషకరం…
రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసే బిల్లును గవర్నర్ ఆమోదించడం సంతోషకరం. విలీన ప్రక్రియను వేగవంతం చేసి ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలి. కరువు భత్యాలు, బకాయీలను ఉద్యోగులకు అందించేందుకు యజమాన్యం చర్యలు తీసుకోవాలి.
– ముదికొండ రవి,
కండక్టర్ సంగారెడ్డి డిపోఉద్యోగుల పాలిట కేసీఆర్ దేవుడు..
తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీ ఉద్యోగుల పాలిట సీఎం కేసీఆర్ దేవుడయ్యారు. ప్రభుత్వంలో సంస్థను వీలినం చేసి ఉద్యగులకు భద్రత కల్పించారు. ఉద్యోగులను కాపాడుకోడానికి వేతనాలు పెంచి గౌరవించిన ఘనత ముఖ్యమంత్రిదే. ఆర్టీసీ విలీనాన్ని త్వరగా పూర్తిచేసి ఆర్టీసీ ఉద్యోగులకు భద్రత కల్పిస్తారని ఆశగా ఉన్నది.
– అంజయ్య, డీఎం ఆఫీస్ జహీరాబాద్ డిపో
సీఎం కేసీఆర్‌ది గొప్ప మనస్సు
ప్రజా రవాణా ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చిన సీఎం కేసీఆర్‌ది గొప్ప మనస్సు. కార్మికుల ఆకాంక్షలను నెరవేర్చాలని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నిర్ణయ బిల్లును గవర్నర్ తమిళిసై ఆమోదించినందుకు గవర్నర్‌కు కృతజ్ఞతలు. విలీన బిల్లుతో రాష్ట్రంలో 43వేల మంది ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు గుర్తించబడుతారన్నారు. ఆర్టీసీ కార్మికుల చిరకాలను కలను నిజం చేసిన సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటాం.
– మౌలానా, నేషనల్ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, సిద్దిపేట
మా కుటుంబం అంతా సంతోషంగా ఉంది..
ఎన్నడూ మేము గిట్ల గవర్నమెంట్ ఉద్యోగులం అయితమని అనుకోలే. సీఎం కేసీఆర్ చెయ్యబట్టే ఇవ్వాల ఉద్యోగులం అయినం. అనుమానాలు, ఇబ్బందులు, సమస్య వల్ల మేం ఇన్నాళ్లు ఉన్నం. మా కుటుంబాలు కూడా చాలా సంతోషపడుతున్నయి. ఇవ్వాల ఆర్టీసీ ఉద్యోగులు అనకుండా ప్రభుత్వ ఉద్యోగులం అయినామని సంతోషంగా ఉంది. ఆర్టీసీ ఉద్యోగుల ఫైల్‌మీద గవర్నర్ సంతకం చేయడం మాకు వరంలాంటిది.
– తాళ్లపల్లి కొమురయ్య, ఆర్టీసీ డ్రైవర్, హుస్నాబాద్