మెదక్ మున్సిపాలిటీ/రామాయంపేట/సంగారెడ్డి, మార్చి 14: వేసవి తీవ్రత నేపథ్యంలో శుక్రవారం నుంచి అన్ని పాఠశాలల్లో ఒంటిపూట తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ ఈనెల 8న ఉత్తర్వులు జారీచేసింది. మార్చి 15 నుంచి ఏప్రిల్ 24 వరకు జిల్లాలో ఒంటిపూట బడులు కొనసాగనున్నాయి. ఉదయం 8నుంచి మధ్యా హ్నం 12.30 వరకు తరగతులు నిర్వహిస్తారు.
ఆ తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తారు. ఈనెల 18నుంచి పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో పదోతరగతి విద్యార్థులకు మాత్రం మధ్యా హ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు నిర్వహిస్తారు. పరీక్షలు నడిచే స్కూళ్లలో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5 వరకు పాఠశాలలు నడుస్తాయి. పరీక్షలు లేని పాఠశాలల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పాఠశాలలు నడుస్తాయి. పరీక్షలు రాసే పదోతరగతి విద్యార్థులు మినహా 1నుంచి 9తరగతుల విద్యార్థులు ఒంటిపూట బడులకు హాజరుకావాల్సి ఉంటుంది.