గజ్వేల్, ఆగస్టు 3: రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ సందర్భంగా గజ్వేల్ కాంగ్రెస్‌లో ఉన్న వర్గపోరు బయటపడింది. గజ్వేల్ కాంగ్రెస్‌లో రెండు గ్రూప్‌లుగా ఉన్న నేతల మధ్య సఖ్యత కొరవడింది. ఆదివారం ముట్రాజ్‌పల్లి సమీపంలోని ఎస్ఎం ఫంక్షన్హాల్లో రేషన్ కార్డుల ప్రొసీడింగ్స్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగానే, వేదికపై ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి కూర్చోవడంపై మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి వర్గీయులు గొడవకు దిగారు. వేదికపైకి తూంకుంట నర్సారెడ్డిని పిలవాలంటూ ఆయన వర్గీయులు నినాదాలు చేశారు.
కేరింతలు చేస్తూ పోలీసులను తోచుకుంటూ వేదికపైకి వెళ్లే ప్రయత్నం చేశారు. ప్రొటోకాల్ లేనివారిని అనుమతించమని పోలీసులు వారిని అడ్డుకున్నారు. వినకుండా నర్సారెడ్డి వర్గీయులు వేదికపైకి పోలీసులను తోచుకుంటూ వెళ్లారు. దీంతో కొద్దిసేపు సమావేశంలో ఉద్రిక్త పరిస్థితి చోటుచేసుకుంది. ఏమి జరుగుతుందో తెలియక కొంతమంది లబ్ధిదారులు బయటకు వెళ్లారు. వేదికపైనే ఉన్న మంత్రి వివేక్ సీరియస్‌గా మాట్లాడుతూ.. ఇది పార్టీ కార్యక్రమం కాదని, ప్రభుత్వ కార్యక్రమం అని, ఈ పద్ధతి బాగాలేదంటూ ఆందోళనకు దిగిన వారిని హెచ్చరించారు.
వేదిక మీద ఉన్న ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డిని నచ్చజెప్పి అధికారులు, పోలీసులు కిందకు పంపడంతో కాంగ్రెస్ కార్యకర్తలు శాంతించారు. కాంగ్రెస్ గొడవ జరుగుతున్న సమయంలో వేదికపై రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కలెక్టర్ హైమావతి, అడిషనల్ కలెక్టర్లు, ఏసీపీతో పాటు అధికారులు ఉన్నారు. జగదేవ్‌పూర్‌లో జరిగే కార్యక్రమానికి మంత్రి వివేక్ హాజరవుతుండగా, మంత్రికి స్వాగతం పలికేందుకు వచ్చిన ఓ కాంగ్రెస్ నాయకుడిని కలవనివ్వకపోవడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
అసహనం వ్యక్తం చేసిన మంత్రి వివేక్
ప్రభుత్వ కార్యక్రమంలో సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనకు దిగడంతో జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్ అసహనం వ్యక్తం చేశారు. నర్సారెడ్డిని వేదికపైకి పిలవాలంటూ చేసిన ఆందోళనను కొద్దిసేపు మంత్రి అలానే చూస్తూ ఉండిపోయారు. ఏమి జరుగుతుందో తెలియక అధికారులు, లబ్ధ్దిదారులు అయోమయానికి గురయ్యారు. నర్సారెడ్డి జిందాబాద్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఇది ప్రభుత్వ కార్యక్రమమా, పార్టీ కార్యక్రమమా అంటూ అధికారులు, లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారు, ఘటనపై మంత్రి వివేక్ అసహనం వ్యక్తం చేస్తూ, ఇది మంచి పద్ధ్దతి కాదంటూ హెచ్చరించారు.
అంబేద్కర్ చౌరస్తాలో ఆందోళన
మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డిని కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ చౌరస్తాలో మరోవర్గం నాయకులు ఆందోళనకు దిగారు. నర్సారెడ్డి డౌన్ డౌన్, నర్సారెడ్డి దౌర్జాన్యాలు నశించాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. అనంతరం గజ్వేల్ పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు కొమ్ము విజయ్‌కుమార్(యాదగిరి) తనపై దాడిచేసిన తూంకుంట నర్సారెడ్డి వర్గీయులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాడు.
గజ్వేల్‌లో మొదటి నుంచి గ్రూపు రాజకీయాలు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గజ్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్‌లో మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గ్రూప్‌లుగా విడిపోయారు. ఆదివారం జరిగిన గొడవలో మైనంపల్లి హనుమంతరావు వర్గానికి చెందిన ఆత్మ కమిటీ చైర్మన్ మల్లారెడ్డి వేదికపై కూర్చోవడంతో గొడవ చోటుచేసుకుంది. ప్రభుత్వ కార్యక్రమం కొనసాగేలా చూడాలని మంత్రి వివేక్ చెప్పడంతో రెండు వర్గాలకు చెందిన నాయకులు ఫంక్షన్ హాల్ బయటకు వెళ్ల్లగానే, హనుమంతరావు వర్గానికి చెందిన వారిపై నర్సారెడ్డి వర్గీయుల దాడికి పాల్పడ్డారు.