మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 25 : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ క్యాథడ్రల్ చర్చిలో క్రిస్మస్ అంగరంగ వైభవంగా జరిగాయి. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గురువారం తెల్లవారుజామున 4.30 గంటల ప్రాంతంలో చర్చిలో శిలువ ఊరేగింపుతో వేడుకలు ప్రారంభమయ్యాయి. తొలి ఆరాధన దైవంలో సినాడ్ మాడరేటర్, బిషప్ రెవరెండ్ రూబెన్ మార్క్ పాల్గ్గొని భక్తులనుద్దేశించి వాక్యోపదేశం చేశారు. యేసు ప్రభువు విశ్వానికి మార్గం చూపే లోక రక్షకుడని, యేసు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని పిలుపునిచ్చారు.
దైనందిక జీవితంలో అందరూ కలిసి మెలసి ఉండాలనేదే ప్రభువు లక్ష్యం అన్నారు. మెదక్ చర్చిలో 101వ క్రిస్మస్ పండుగను అందరూ సుఖ సంతోషాలు, ఆనందోత్సాహాలతో జరుపుకొన్నట్లు తెలిపారు. ఈ మహా దేవాలయం విశ్వసనీయతకు ప్రతి రూపమని, ఆసియా ఖండానికి ప్రతిబింబంగా నిలిచిందన్నారు.

ఈ సందర్భంగా డయాసిస్ సభ్యులు, చర్చి కమిటీ సభ్యులతో కలిసి బిషప్ క్రిస్మస్ కేక్ కట్ చేశారు.అనంతరం రెండో ఆరాధన దైవం ఉదయం 10 గంటలకు చర్చి ప్రేసీబేటరీ ఇన్చార్జి రెవరెండ్ శాంతయ్య ఆధ్వర్యంలో కొనసాగింది. భక్తులు ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ఫాస్టర్ల ఆశీర్వాదం తీసుకున్నారు. గురువారం ఉదయం నుంచి రాత్రి 8 గంటల వరకు భక్తుల రద్దీ కొనసాగింది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వేలాదిగా భక్తులు తరలిరావడంతో చర్చి ప్రాంగణం కిక్కిరిసిపోయింది.
బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి మెదక్ చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గ్గొని కేక్ కట్ చేశారు. చర్చి కమిటీ సభ్యులు వారిని శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చిగా పేరున్న ఈ మహా దేవాలయం మెదక్‌లో ఉండడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. యేసుప్రభువు దయ అందరిపై ఉండాలన్నారు. ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున్‌గౌడ్, మాజీ కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయరులు తదితరులు ఉన్నారు. విద్యుద్దీపాల కాంతుల్లో రాత్రంతా చర్చి ప్రాంతం వెలిగిపోయింది. మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు కల్పించారు.