సంగారెడ్డి, మే 29: “పని ఏదైనా సరే ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి నిలబడి మాట తప్పకుండా.. మడమ తిప్పకుండా అమలు చేయడమే ఆయన లక్ష్యం..ప్రజా క్షేత్రంలో నిరంతర శ్రామికుడిగా సేవలందించే గొప్ప మనసు ఉన్న నాయకుడు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు” అని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గుర్తుచేశారు. జూన్ 3న హరీశ్‌రావు పుట్టినరోజును పురస్కరించుకుని గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాటల సీడీని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, జహీరాబాద్ ఎమ్మెల్యే మానిక్రావుతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు మా ట ఇస్తే అమలు చేసే నైజాన్ని పుట్టుకతోనే కొని తెచ్చుకున్న గొప్ప నాయకుడు హరీశ్‌రావు అని కొనియాడారు. అధికారంలో ఉండగా ఏశాఖ పద వి ఇచ్చినా సమర్థవంతంగా తనదైన శైలిలో వన్నె తెచ్చిన నాయకుడిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించిన నేతగా ముద్రవేసుకున్నారన్నారు. ప్రభుత్వంలో ఉన్నపుడు కాళేశ్వరం ప్రాజెక్టు పనులు అప్పగిస్తే శక్తివంచన లేకుండా అప్పటి గవర్నర్ చేత కాళేశ్వర్రావు అనే పేరు సంపాదించిన ఘనత హరీశ్‌రావుకే దక్కిందన్నారు. ప్రజలు, నాయకులు వస్తే వెంటనే సమస్యలు తెలుసుకుని నేనున్నానంటూ భరోసా కల్పించి గుండెకు హత్తుకునే నాయకుడు హరీశ్‌రావు అని ఎమ్మెల్యే కితాబిచ్చారు.
మంత్రిగా ఉన్నా లేకున్నా పార్టీ నాయకులు, ప్రజలు తన దగ్గరకు వెళ్తే సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఫోన్లో చెప్పే అలవాటు కలిగిన వ్యక్తి హరీశ్‌రావు అని ఎమ్మెల్యే మానిక్‌రావు అన్నారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ, ప్రజలగుండెల్లో గూడు కట్టుకున్న నాయకుడిగా గుర్తింపు సాధించడం గొప్పవిషయమన్నారు. అన్నా అని పిలిచే నాయకుడు హరీశ్‌రావు. .హరీశ్‌రావు అండ కొండంత అండ..ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని పాటల సీడీ ఆవిష్కరణలో భాగస్వామ్యం కావడం సంతోషకరమన్నారు.
పాటల సీడీ ఆవిష్కరణకు కృషి చేసిన స్రవంతి, అరవింద్రెడ్డిలకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. పాటల సీడీ ఆవిష్కరణలో జిల్ల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యమ్, మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, నాయకులు రాజేందర్, శివరాజ్ పాటిల్, చింత గోపాల్, మందుల వరలక్ష్మి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆర్.వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి నర్సింహులు, బీఆర్ఎస్ జహీరాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల అధ్యక్షులు నారాయణ, వెంకటేశం, సంజీవరెడ్డి, నర్సింహులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.