సంగారెడ్డి, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఉద్యమ రథసారధి కేసీఆర్ ఒక్క పిలుపునిస్తే ఆయన వెన్నంటే దండులా కదలటం సంగారెడ్డి జిల్లా జనం నైజం. మలిదశ తెలంగాణ ఉద్యమంలో సంగారెడ్డి జిల్లా ప్రజలు కేసీఆర్ వెన్నంటే నడిచారు. ప్రత్యేక తెలంగాణ సాధన కోసం కేసీఆర్ సారథ్యంలో జరిగిన ప్రతి పోరాటంలో జిల్లా ప్రజలు పాల్గొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులతో పాటు అన్నివర్గాలు తెలంగాణ ఉద్యమంలో చివరి వరకూ పోరాడారు.
తెలంగాణ సిద్ధించిన అనంతరం వచ్చిన ప్రతి ఎన్నికల్లోనూ జిల్లా ప్రజలు బీఆర్ఎస్కు పట్టం కట్టి అధినేతపై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తిచేసుకున్న సందర్భాన్ని ప్రజలు ప్రస్తుతం గుర్తు చేసుకుంటున్నారు. ఈనెల 27న వరంగల్ జిల్లాలో జరగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు దండులా కదిలేందుకు జిల్లా ప్రజలు, రైతులు, యువకులు, విద్యార్థులు, బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధమవుతున్నారు. జిల్లా అంతటా బీఆర్ఎస్ రజతోత్సవ సందడి కనిపిస్తున్నది.
నాటి ఉమ్మడి మెదక్ జిల్లాలోని సిద్దిపేట గడ్డ నుంచి తెలంగాణ ఉద్యమానికి కేసీఆర్ సమరశంఖం పూరించారు. 27 ఏప్రిల్, 2001న కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ పురుడుపోసుకుంది. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణను సాధించడమే కాకుండా వచ్చిన తెలంగాణ రాష్ర్టాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి దేశానికి తలమానికంగా తీర్చిదిద్దారు. తెలంగాణ ప్రజల స్వప్నం సాకారం చేసిన బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తి కానున్న సందర్భంగా ఈనెల 27న వరంగల్ జిల్లాలో పెద్దఎత్తున రజతోత్సవ సభను నిర్వహించనున్నారు.ఈ సభకు సంగారెడ్డి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.
మాజీ మంత్రి హరీశ్‌రావు నేతృత్వంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు వరంగల్ సభను విజయవంతం చేయడంలో నిమగ్నమయ్యారు. మాజీ మంత్రి హరీశ్‌రావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, పటాన్చెరు కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, జడ్పీ మాజీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి తదితరులతో సమావేశమై వరంగల్ సభకు సన్నద్ధంపై దిశానిర్దేశం చేశారు. ఇటీవల సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గాల్లో నిర్వహించిన పార్టీ సమావేశాల్లోనూ వరంగల్ సభ ఏర్పాట్లపై చర్చించారు. రజతోత్సవ సభకు పెద్దఎత్తున తరలిరావాలని ప్రజలు, పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
వరంగల్‌లో ఈనెల 27న నిర్వహించే రజతోత్సవ సభ విజయవంతం చేయడంపై బీఆర్ఎస్ నాయకత్వం సమావేశాలు నిర్వహించడంతో పాటు రజతోత్సవ సభపై జిల్లా అంతటా వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నది. బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అందోలు, జహీరాబాద్, నారాయణఖేడ్, పటాన్చెరు నియోజకవర్గాల నాయకులతో సమావేశమై రజతోత్సవ సభకు పార్టీ శ్రేణుల తరలింపుపై చర్చించారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తన సొంత నియోజకవర్గమైన సంగారెడ్డిలో మండలాలు, మున్సిపాలిటీల వారీగా పార్టీ నాయకులతో సమావేశాలు నిర్వహించారు. వరంగల్ సభకు జనం, బీఆర్ఎస్ శ్రేణుల తరలింపుపై దిశానిర్దేశం చేశారు.
రజతోత్సవ సభపై నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. సంగారెడ్డి, సదాశివపేట పట్టణాల్లో నిర్వహించిన వాల్‌రైటింగ్, వాల్‌పోస్టర్ల ప్రచార కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్వయంగా పాల్గొన్నారు. జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు పక్షం రోజులుగా రజతోత్సవ సభ విజయవంతం కోసం నియోజకవర్గంలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జహీరాబాద్ నియోజకవర్గంలో రజతోత్సవ సభ విజయవంతం కోసం పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ రజతోత్సవ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు.
నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి సైతం నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పర్యటిస్తూ వరంగల్ సభ విజయవంతంపై పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తున్నారు. వరంగల్ సభపై పోస్టర్లు ఆవిష్కరించడంతో పాటు వాల్‌రైటింగ్ ఇతర ప్రచార కార్యక్రమాల్లోనూ స్వయంగా పాలుపంచుకున్నారు. పటాన్చెరు నియోజకవర్గం నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు వరంగల్ సభకు తరలివచ్చేలా నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి నియోజవర్గం నుంచి 5 నుంచి 10వేల మంది జనం, పార్టీ శ్రేణులు వరంగల్ సభకు తరలివెళ్లేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్న ప్రజలు రజోత్సవ సభకు స్వచ్ఛందంగా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఆరు గ్యారెంటీలు ఇచ్చి కాంగ్రెస్ మోసం చేయడంతో ప్రజలు కేసీఆర్ పాలనను గుర్తు చేసుకుంటూ వరంగల్ రజతోత్సవ సభలో పాల్గొనేందుకు రైతులు, యువకులు, విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రజలు, పార్టీ శ్రేణులు వరంగల్ వెళ్లేందుకు 30 నుంచి 40 వరకు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో ప్రైవేటు వాహనాలు సిద్ధం చేస్తున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సొంత వాహనాల్లో వరంగల్ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు.