సంగారెడ్డి, డిసెంబర్ 8(నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ బలపర్చిన సర్పంచ్, వార్డు మెంబర్లను పంచాయతీ ఎన్నికల్లో గెలిపించాలని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు అడిగే హక్కులేదని ఆయన పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ‘నమస్తే తెలంగాణ’ తో మాట్లాడారు. రెండేండ్ల పాలనలో కాంగ్రెస్ పల్లెలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్నారు.
కేసీఆర్ పదేండ్ల పాలనలో చేసిన అభివృద్ధి పనులు ఇప్పటికీ జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో కనిపిస్తున్నాయని చెప్పారు. ఆరుగ్యారెంటీలు, 420 హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్‌కు పంచాయతీ ఎన్నికల్లో కర్రుకాల్చి వాత పెట్టాలని కోరారు. మరీ ముఖ్యంగా బీసీలకు 46 శాతం రిజర్వేషన్ పేరిట రేవంత్ రెడ్డి దగా చేశారని గుర్తు చేశారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్‌కు పంచాయతీ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడిరాష్ట్రంలో అభివృద్ధ్దిలో నిర్లక్ష్యానికి గురైన సంగారెడ్డి జిల్లాలోని గ్రామాలను కేసీఆర్ పదేండ్ల పాలనలో కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశారు. ప్రజల కోరిక మేరకు జిల్లాలో 190కి పైగా కొత్త పంచాయతీలను ఏర్పాటు చేయడంతో పాటు 81కి పైగా తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌ది. పంచాయతీలకు ప్రతినెలా అభివృద్ధి పనులకు కోసం రూ. 10.41 లక్షలు కేసీఆర్ కేటాయించారు. పల్లె ప్రగతి ద్వారా జిల్లాలో రూ.600 కోట్లతో గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు, ఇతర అభివృద్ధి పనులు చేశారు. మండల కేంద్రాల నుంచి గ్రామాలకు 820 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మించారు. మిషన్‌భగీరథ ద్వారా రూ.1138 కోట్లతో ఇంటింటికీ తాగునీరు అందించిన ఘనత కేసీఆర్‌ది.
ప్రతి గ్రామంలో పల్లెప్రకృతివనం, వైకుంఠధామం, డంపింగ్‌యార్డు, నర్సరీ, బృహత్‌పల్లె ప్రకృతివనాలు, క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేశారు. గ్రామాలో ్లపారిశుధ్య పనులకు కేసీఆర్ హయాంలో పెద్దపీట వేశారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్‌ను కేసీఆర్ అందజేశారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేసిన హరీశ్‌రావు పల్లెల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వీలుగా 173 పల్లె దవాఖానలు ఏర్పాటు చేయించారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఇప్పటికీ పల్లెల్లో కనిపిస్తున్నాయి.
రేవంత్‌రెడ్డి పాలనలో సంగారెడ్డి జిల్లాలోని పల్లెల్లో అభివృద్ధి పడకేసింది. రెండేండ్ల పాలనలో జిల్లాలోని పంచాయతీల్లో ఎక్కడా అభివృద్ధి జరగలేదు. పంచాయతీలకు రూపాయి నిధులు రాలేదు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ఆరుగ్యారెంటీలు, 420 హామీల అమలులో సీఎం రేవంత్ విఫలం అయ్యారు. రూ.4వేల పింఛన్ ఇవ్వలేదు, ఆడబిడ్డలకు రూ.2500 ఇస్తామని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ స్కీమ్‌లో తులం బంగారం ఇస్తామని చెప్పి రేవంత్ రెడ్డి ఇవ్వడం లేదు. ఇందిరమ్మ ఇండ్లకు కొర్రీలు పెట్టి పేదలకు పథకాన్ని దూరం చేశారు. గ్రామీణ ప్రజలు రేవంత్ సర్కార్‌పై గుర్రుగా ఉన్నారు. మహిళలు, యువతను మోసం చేసిన కాంగ్రెస్‌కు ఎన్నికల్లో ఓటర్లు బుద్ధ్ది చెప్పాలి.
కేసీఆర్ రైతు సంక్షేమానికి పెద్దపీట వేయగా, రేవంత్‌రెడ్డి రైతులను నిండా ముంచారు. సంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కేసీఆర్ సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు ప్రారంభిస్తే, రేవంత్ సర్కార్ ఈ రెండు పథకాలు నిలిపివేసింది. రైతులకు రూ.15వేల రైతుభరోసా ఇస్తామని, రూ.2 లక్షల పంట రుణమాఫీ చేస్తామని అమలు చేయలేదు. రైతులు పండించిన ధాన్యం, పత్తిని సైతం కాంగ్రెస్ సర్కార్ కొనుగోలు చేయడం లేదు. మద్దతు ధర చెల్లించకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నది.మోసం చేసిన కాంగ్రెస్ సర్కార్‌కు పంచాయతీ ఎన్నికల్లో రైతులు గుణపాఠం చెబుతారు.
కామారెడ్డి డిక్లరేషన్ అమలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కార్‌కు పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు కర్రుకాల్చి వాతపెట్టాలి. మరీ ముఖ్యంగా బీసీలు కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెప్పాలి. బీసీలతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమాన్ని విస్మరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి అన్నివర్గాల వారు బుద్ధి చెబితేనే రేవంత్ సర్కార్‌లో మార్పు వస్తుంది.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు సూచనల మేరకు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ సర్పంచ్, వార్డు సభ్యులకు మద్దతు ఇస్తున్నది. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవ చేయడంతో పాటు గ్రామాభివృద్ధ్దికి పాటుపడే సర్పంచ్, వార్డు సభ్యులకు బీఆర్ఎస్ మద్దతు పలికాం. బీఆర్ఎస్ మద్దతు పలికిన సర్పంచ్, వార్డు సభ్యులను గెలిపించాలని గ్రామాల్లోని ప్రజలను కోరుతున్నారు. బీఆర్ఎస్ మద్దతు పలికిన సర్పంచ్‌లను గెలిపిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే కాలంలో అభివృద్ధి పనులు చేపడుతుంది, లేదంటే యథావిధిగా పల్లెలను నిర్లక్ష్యం చేస్తుంది.