కంది, ఫిబ్రవరి 11: దొంగ హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు తగినవిధంగా గుణపాఠం చెప్పేందుకు సిద్ధమయ్యారని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలనపై విసుగు చెందిన ప్రజలు రాళ్లవర్షం కురిపించడం ఖాయమన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా కందిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు.
రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారని, పంటరుణమాఫీ పూర్తిస్థాయిలో కాలేదని విమర్శించారు. సన్నవడ్లకు ఇస్తామన్న బోనస్ సంగతేమైందని నిలదీశారు. ఆడబిడ్డ పెండ్లికి ఇస్తామన్న తులం బంగారానికి ఎగనామం పెట్టారని,ప్రజాపాలనలో కాంగ్రెస్ విఫలమైందన్నారు. కేసీఆర్ పాలనలో అన్ని వర్గాలు సంతోషంగా ఉన్నాయని, మళ్లీ కేసీఆర్ పాలనే రావాలని కోరుకుంటున్నారని గుర్తుచేశారు.
వందశాతం హామీలు అమలు చేసే దమ్ము, ధైర్యం కాంగ్రెస్‌కు లేదని స్పష్టం చేశారు. ప్రజాసమస్యలపై నిరంతరం పోరాటం చేస్తామన్నారు. సీడీసీ మాజీ చైర్మన్ బుచ్చిరెడ్డి, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ కృష్ణగౌడ్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ నరహరిరెడ్డి, బీఆర్ఎస్ కంది మండల అధ్యక్షుడు మధుసూదన్‌రెడ్డి, నాయకులు ప్రభాకర్, మనోహర్‌గౌడ్, మహేందర్‌రెడ్డి, నందకిశోర్, పుల్లారెడ్డి పాల్గొన్నారు.