సిద్దిపేట, మే 20: సిద్దిపేట అంటే ఆదర్శం, అభివృద్ధి, అవార్డులకు చిరునామా అని, మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు లాంటి నాయకుడు ఉండడం సిద్దిపేట ప్రజల అదృష్టమని చినజీయర్ స్వామి అన్నారు. సిద్దిపేటలోని వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడానికి మంగళవారం చినజీయర్ స్వామి వచ్చారు. మంగళవారం సిద్దిపేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయనకు హరీశ్‌రావు-శ్రీనిత దంపతులు పాదపూజ నిర్వహించారు.
పాదపూజ అనంతరం చినజీయర్ స్వామి ఎమ్మెల్యే హరీశ్‌రావుతో పాటు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆశీస్సులు అందజేశారు. క్యాంపు కార్యాలయం నుంచి తిరిగి వెళ్లేటప్పుడు అక్కడి వారితో కాసేపు ఆత్మీయంగా ముచ్చటించారు. హరీశ్‌రావు సిద్దిపేటను ఎంతో అభివృద్ధి చేశారని, సిద్దిపేట పేరు లేకుండా ఏ అవార్డుల కార్యక్రమం ఉండదని, ఎన్నో అవార్డులు వచ్చాయని, దీనంతటికి ఎమ్మెల్యే హరీశ్‌రావు పనితీరు, పట్టుదల కారణం అని చినజీయర్ స్వామి అన్నారు.