మెదక్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లాలో బాల్య వివాహాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఐసీడీఎస్ అధికారులు ప్రతి సంవత్సరం పదుల సంఖ్యలో బాల్య వివాహాలను అడ్డుకుంటున్నారు. అధికారుల దృష్టికి రాకుం డా అంతకు పదిరెట్లు పెండ్లిళ్లు జరుగుతు న్నాయి. పిల్లకు పెండ్లి చేసి పంపిస్తే భారం తగ్గుతుందన్న ఉద్దేశంతో కొందరు, దగ్గర సంబంధం వచ్చిందని మరికొందరు చిన్న వయస్సులోనే పెండ్లిళ్లు చేస్తున్నారు. ఇటువంటి వివాహాల్లో బాలికల సగటు వయస్సు 15 నుంచి 16 ఏండ్లు ఉంటోంది. 15 నుంచి 20 శాతం వివాహాల్లో 25 ఏండ్లుపైబడిన అబ్బాయిలు మైనర్ బాలికలను వివాహం చేసుకుంటున్నారు.
బాల్య వివాహాలు ఎకువగా గ్రామీణ ప్రాం తాల్లోనే జరుగుతున్నాయి. ఇందుకు ప్రధాన కారణం నిరక్షరాస్యతేనని అధికారులు పేరొంటున్నారు. బాలికలకు చదువుకోవాలనే ఆసక్తి ఉన్నా కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోవడం, దగ్గర సంబంధాలు పోతే ఆడపిల్లకు పెండ్లి చేయడం కష్టమని తల్లిదండ్రులు భావించడం, పిల్లకు పెండ్లి చేస్తే బాధ్యత తీరిపోతుందని ఆలోచిస్తుండటం బాల్య వివాహాలకు కారణమవుతున్నాయి. పదో తరగతితో చదువు ఆపేసి ఇంట్లో ఉంటున్నైట్లెతే తల్లిదండ్రులు అభద్రతా భావానికి గురవుతున్నారన్న విషయాన్ని చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు గుర్తించారు.
మెదక్ జిల్లా వ్యాప్తంగా మూడేండ్లలో 115 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. జిల్లాలో బాలల హక్కులు, చట్టాలపై అవగాహన లేకపోవడం, ఆకర్షణకు లోనై పెద్దలకు చెప్పకుండా పెండ్లి చేసుకుంటున్నారు. ఆడ పిల్లలు ఎక్కువగా ఉన్న కుటుంబాల్లో తొందరగా పెండ్లి చేస్తే తమ బాధ్యత తీరుతుందనే ఆలోచనతో తల్లిదండ్రులు బాల్యవివాహాలు చేస్తున్నారు. ప్రతి సంవత్సరం వందల సంఖ్యలో బాల్య వివాహాలు జరుగుతుంటే.. పదుల సంఖ్యలో మాత్రమే అడ్డుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.
బాలల సంరక్షణ, హక్కుల పరిరక్షణ, బాల్య వివాహాలను అడ్డుకోవడం, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, దత్తత, వీధి బాలల సంరక్షణ, అనాథ పిల్లల సంరక్షణ మొదలైన వాటి కోసం జిల్లాలో అంగన్వాడీ సెంటర్లు, చైల్డ్‌లైన్, బాలల పరిరక్షణ, మహిళా సాధికారత వంటి విభాగాలతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు కూడా పనిచేస్తున్నాయి. ఇంత నెట్వర్క్ ఉన్నప్పటికీ బాల్య వివాహాలను పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతున్నట్లు విమర్శలు ఉన్నాయి. బాల్య వివాహాలతో జరిగే అనర్థాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పించకపోవడం, ప్రతినెలా సీడీపీవోలు, సూపర్వైజర్లు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షలు నిర్వహించినా పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శ ఉంది.
బాల్య వివాహాల నిరోధక చట్టాన్ని బ్రిటీష్ హయాంలోనే రూపొందించారు. అయితే ఈ చట్టంతో ఆశించిన ఫలితాలు రాకపోవడంతో మరింత పకడ్బందీగా అమలుచేయాలని భావించిన కేంద్ర ప్రభుత్వం 2006లో కొత్త చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం అమ్మాయికి 18, అబ్బాయికి 21 ఏండ్లు నిండిన తర్వాతే వివాహం చేయాలి.
అలా కాదని పెండ్లి చేస్తే పెండ్లి కుమారుడికి, అతడి తల్లిదండ్రులు, పెండ్లికి హాజరైన వారికి, వివాహం చేసిన పురోహితులకు రెండేండ్లు జైలు శిక్ష, లక్ష వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. మైనర్ బాలికను వివాహం చేసుకుని జీవనం సాగిస్తే వరుడు, అతడి తల్లిదండ్రులు, బాలిక తల్లిదండ్రులు, బంధువులకు పోక్సో చట్టం ప్రకారం 10 నుంచి 20 ఏండ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించవచ్చు.
జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్లు తెలిస్తే జిల్లా కలెక్టర్, పోలీసు ఉన్నతాధికారులు(100), మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు, చైల్డ్‌లైన్(1098), తహసీల్దార్ , సీడీపీవో, గ్రామ స్థాయిలో వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులకు వెంటనే సమాచారం తెలియజేయవచ్చు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతారు.
చిన్న వయస్సులోనే బాలికలకు వివాహాలు చేయడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రధానంగా స్త్రీలు త్వరగా రక్తహీనతకు గురికావడం, శిశువులు అనారోగ్యంగా జన్మించడం, అవయవ ఎదుగుదల లేకపోవడం, శిశు మరణాలు, పిల్లలు జన్యుపరమైన సమస్యలతో జన్మించడం, దంపతుల మధ్య అవగాహన లోపంతో కుటుంబంలో కలహాలు, మానసిక పరిపక్వత లేకపోవడంతో చిన్న సమస్య తలెత్తినా ఆత్మహత్యలకు యత్నించడం వంటి ఇబ్బందులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.
బాల్య వివాహాలతో అనేక ఇబ్బందులు ఉంటాయి. కొంతమంది తల్లిదండ్రులు ఆ విషయం గుర్తించకుండా చిన్న వయస్సులోనే పెండ్లి చేయాలని భావిస్తున్నారు. మాకు సమాచారం వస్తే వివాహాలను వివిధ శాఖల అధికారుల సహాయంతో నిలిపివేస్తున్నాం. చాలావరకు తెలియకుండా పెండ్లిళ్లు జరుగుతున్నాయి. పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు ఆలోచన చేయాలి.
-కరుణశీల, డీసీపీవో మెదక్ జిల్లా