చేర్యాల, డిసెంబర్ 26 : చేర్యాల జడ్పీటీసీ శెట్టె మల్లేశం (43) దారుణహత్యకు గురయ్యాడు. సోమవారం వేకువజామున వాకింగ్ వెళ్లిన జడ్పీటీసీపై గుర్తు తెలియని వ్యక్తులు మాటువేసి మారణాయుధాలతో దాడి చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పుకూలిపోయాడు. దాడికి గురైన ఘటన తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు, బీఆర్ఎస్ నాయకులు హుటాహుటిన ఆయన్ను సిద్దిపేట దవాఖానకు తరలించారు. సిద్దిపేట దవాఖానలో వైద్యులు ప్రాథమిక చికిత్సలు నిర్వహించి, మెరుగైన వైద్య సేవల కోసం హైదరాబాద్ తీసుకుపోవాలని సూచించడంతో జడ్పీటీసీని సికింద్రాబాద్ యశోద దవాఖానకు తీసుకెళ్లి చేర్పించారు. అక్కడి వైద్యులు పరీక్షించి, మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. జడ్పీటీసీ స్థాయిలో ఉన్న వ్యక్తిని ప్లాన్డ్గా మర్డర్ చేయడంతో చేర్యాల ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
భూ వివాదం.. కుల పంచాయితీలే కారణమా?
గ్రామంలో నెలకొన్న భూ సమస్యల పరిష్కారం, గ్రామ సమస్యలు పరిష్కరిస్తున్న జడ్పీటీసీపై కొందరు వ్యక్తులు కక్ష పెంచుకుని హత్య చేశారని గ్రామస్తులు తెలుపుతున్నారు. నిత్యం వాకింగ్ చేసే అలవాటు ఉన్న జడ్పీటీసీ గుర్జకుంట నుంచి చేర్యాల వైపునకు వచ్చే రోడ్డుపై కల్వ ర్టు వద్దకు రాగానే, గుర్తు తెలియని వ్యక్తులు జడ్పీటీసీ వెనుక నుంచి ఇనుపరాడ్‌తో దాడి చేశారని, కిందపడిన అనంతరం కత్తితో రెండుసార్లు వేటువేసి వెళ్లిపోయినట్లు తెలిపారు. గ్రామానికి చెందిన ఉపసర్పంచ్ సత్యనారాయణ కారును కిరాయికి తీసుకొని, వాకింగ్ చేస్తున్న జడ్పీటీసీ వెనుక నుంచి ఢీకొట్టి అతను కిందపడగానే రంపం కొడవలితో దాడి చేసి హత్య చేసినట్లు కొందరు చెబుతున్నారు.
గ్రామంలో కులంలో నెలకొన్న పెద్దపండుగ నిర్వహణ, కొన్ని భూ తగదాల విషయంలో జడ్పీటీసీ తీర్పు నచ్చని వ్యక్తులే ఈ హత్య చేశారని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు విలేకరులకు తెలిపారు. జడ్పీటీసీ హత్య చేసిన దుండగుల్లో ఒకరు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. గ్రామంలో అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు గుర్జకుంటులో మోహరించారు. కాగా, హంతకుడిగా అను మానిస్తున్న వ్యక్తి ఇంటిని కూల్చడానికి జడ్పీటీసీ బంధువులు, స్నేహితులు వెళ్లగా, పోలీసులు అడ్డుకున్నారు.
మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి
చేర్యాల జడ్పీటీసీ శెట్టె మల్లేశం హత్యకు గురైన ఘటనపై వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. నిత్యం ప్రజాసేవకు పరితపించే మంచి నాయకుడు మల్లేశమని, ఆయన మృతి బాధాకరమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. జడ్పీటీసీ మృతిపై సం తాపం వ్యక్తం చేయడంతో పాటు వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సంఘటనపై విచారణ చేపట్టి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్‌ను మంత్రి ఆదేశించారు. అలాగే, మంత్రి జడ్పీటీసీ భౌతికకాయానికి పోస్ట్‌మార్టం పూర్తి చేసేలా పోలీస్ అధికారులు, వైద్యులతోఎప్పటికప్పుడు పర్యవేక్షించారు. మంత్రి పర్యవేక్షణ కొనసాగుతుండగా, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, టీఆర్ఎస్ రాష్ట్ర నేత వేలేటి రాధాకృష్ణ శర్మ, జడ్పీటీసీ మల్లేశం కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.
దుండగులపై కఠిన చర్యలు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
జడ్పీటీసీని హతమార్చిన దుండగులు ఎంతటి వారైనా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కోరారు. హత్య విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి స్థానిక ప్రజాప్రతినిధులను అలర్ట్ చేశారు. ఘటనా స్థలం నుంచి సిద్దిపేటకు తరలించే వరకు పర్యవేక్షించారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు దృష్టికి హత్యోదంతాన్ని తీసుకెల్లారు. వెంటనే మంత్రి స్పందించి, సీపీతో పాటు వైద్య అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చేర్యాల ఠాణాకు ఎమ్మెల్యే చేరుకొని, దుండగులపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరారు. యశోద దవాఖాన నుంచి జడ్పీటీసీ మృతదేహం గజ్వేల్ దవాఖానకు తీసుకురాగా, ఎమ్మెల్యే అక్కడే ఉండి పోస్టుమార్టం చేయించారు. ఎమ్మెల్యే సైతం కంటనీరు పెట్టారు. జడ్పీటీసీని హత్య చేసిన వారిని వదిలిపెట్టే సమస్యే లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
స్పాట్‌ను పరిశీలించిన సీపీ శ్వేత
ఘటనా స్థలాన్ని సీపీ శ్వేత పరిశీలించారు. హత్యకు దారి తీసిన పరిస్థితులు, చేర్యాల ప్రాంతంలో పాటు గ్రామం లో నేరచరిత కలిగిన వ్యక్తుల వివరాలను సీపీ అడిగి తెలుసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు హుస్నాబాద్ ఏసీపీ సతీశ్, చేర్యాల సీఐ శ్రీనివాస్, ఎస్సై భాస్కర్‌రెడ్డితో టీమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. నిందితులను 24గంటల్లో పట్టుకుంటామని సీపీ పేర్కొన్నారు. హత్యకు గల కారణాలను ఛేదించి, త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు.
బీఆర్ఎస్ శ్రేణుల నిరసన
జడ్పీటీసీ హత్యకు నిరసనగా చేర్యాలలో బంద్ పాటించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ తీశారు. హత్యకు నిరసనగా పట్టణంలో వ్యాపార, వాణి జ్య సంస్థలు మూసివేసి వ్యాపారులు సంతాపం తెలిపారు. స్వగ్రామంలోని గుర్జకుంటలో మంగళవారం జడ్పీటీసీ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ శ్రేణులు తెలిపాయి. అంత్యక్రియలకు మంత్రి హరీశ్‌రావు, పలువురు హాజరుకానున్నారు.
గుర్జకుంటలో ఉద్రిక్తత
హత్య ఘటనలో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న గ్రామ ఉపసర్పంచ్ నంగి సత్యనారాయణ ఇంటి ఎదుట జడ్పీటీసీ భార్య స్వప్న బంధువులతో కలిసి సోమవారం రాత్రి బైఠాయించింది. తన భర్త హత్యకు కారణమైన సదరు వ్యక్తి శవాన్ని తాము కండ్ల చూ స్తామని స్వప్న అనడంతో జడ్పీటీసీ బంధువులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. దీంతో గ్రామంలో శాంతిభద్రతల సమస్య తలెత్తనున్నదని గమనించిన పోలీసులు మృతుడి కుటుం బ సభ్యులను శాంతింపజేసేందుకు యత్నించారు. హత్య చేసిన వారికి శిక్ష పడేలా చట్టం పని చేస్తున్నదని వారికి నచ్చజెప్పడంతో వారు శాంతించారు. పోలీసులు గ్రామంలో మోహరించడంతో పలువురు వెనక్కి తగ్గారు.