అందోల్, జూలై 13: ఆర్డినెన్స్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తున్నదని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ విమర్శించారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా అందోల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో 50శాతంగా ఉన్న బీసీ జనాభాను కాంగ్రెస్ ప్రభుత్వం 42శాతంగా చూపిస్తూ అన్యాయం చేస్తున్నదని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరలేపిందని, ఆర్డినెన్స్ పేరుతో రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నదని ధ్వజమెత్తారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి ఉంటే 20నెలలుగా పెండింగ్‌లో ఉన్న బీసీ బిల్లుపై కేంద్ర ప్రభుత్వంపై ఎందుకు ఒత్తిడి తీసుకు రావడంలేదని ఆయన ప్రశ్నించారు. ఆచరణ సాధ్యం కానీ హామీలతో రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ఇప్పుడు అవే అబద్ధ్దాలతో మరోసారి స్థానిక సంస్థలో లబ్ధిపొందాలని చూస్తున్నదని, ప్రజలు కాంగ్రెస్ సర్కారుపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
బీసీలకు అన్నిరంగాల్లో 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో పేర్కొన్నారని, ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు కావస్తున్నా చెప్పిన ఏ ఒక్క హామీని అమలు చేయడం లేదని విమర్శించారు.బీసీలకు అన్యాయం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తు ఊరుకోదని, కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడతామని చంటి క్రాంతి కిరణ్ అన్నారు. సమావేశంలో నియోజకవర్గ నాయకులు రామాగౌడ్, నాగభూషణం, లింగాగౌడ్, వెంకటేశం, సాయికుమార్, వీరప్ప, శివకుమార్, శశికుమార్, నాగరత్నంగౌడ్, పాండు, రమేశ్, నర్సింహు లు, బీర్ల శంకర్, ఆంజనేయులు,రఫీక్ పాల్గొన్నారు.