సిద్దిపేట టౌన్, డిసెంబర్ 11: తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలను మార్చడం ప్రభుత్వ అవివేకమైన చర్య అని మంజీరా రచయితల సం ఘం స్పష్టం చేసింది.ప్రభుత్వ నిర్ణయాన్ని మంజీరా రచయితల సం ఘం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని పేర్కొన్నారు. తెలంగాణ తల్లి చేతిలో నుంచి బతుకమ్మను తీసివేయడం అంటే తెలంగాణ అస్తిత్వాన్ని, సం స్కృతిని అవమానించడమే అవుతుందని మంజీరా రచయితల సం ఘం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రంగాచార్య,ప్రధాన కార్యదర్శి యాదగిరి,తెలంగాణ రచయితల సంఘం జిల్లా అధ్యక్షుడు బాలయ్య, ప్రధా న కార్యదర్శి గంభీర్రావుపేట యాదగిరి, మంజీరా రచయితల సం ఘం ప్రతినిధులు శ్రీనివాస్ అన్నారు. బుధవారం రాత్రి సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ..తెలంగాణ తల్లి విగ్రహం రాజకీయ పార్టీలు, వ్యక్తులు తయారు చేసింది కాదన్నారు.
తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టిన అస్తిత్వపతాక తెలంగాణ తల్లి విగ్రహం అని అన్నారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసి పడుతున్న సందర్భంలో తెలంగాణ రాజకీయ, సాహిత్య, సాంస్కృతిక సం ఘాల ప్రతినిధులు, రచయితలు, విద్యావేత్తలు, మేధావులు కలిసి నిర్ణయించి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారన్నారు. తల్లి విగ్రహం ఒక ఆరాధ్య భావనతో కొలవాలనే సంకల్పంతో విగ్రహాన్ని రూపాకల్పన చేశారని, ఆ విగ్రహం ప్రజల గుండెల్లో కొలువుదీరిందన్నారు. అలాంటి విగ్రహాన్ని తొలిగించి కొత్త విగ్రహం తయారు చేయాల్సిన అవసరం ఏమున్నదని మండిపడ్డారు. విగ్రహంలో పార్టీ గుర్తు కనిపించేలా తయారు చేయడం తెలంగాణ ప్రజలు హృదయాలను గాయపరచడమే అవుతుందన్నారు. విగ్రహం మార్పు నిర్ణయం రాజకీయంతో కూడుకుని ఉన్నట్టు మంజీరా రచయితల సంఘం పేర్కొంది.
నందిని సిధారెడ్డి నిర్ణయం అభినందనీయం
తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలను, తెలంగాణ సంస్కృతికి చిహ్నమైన బతుకమ్మను విగ్రహం నుంచి తొలిగించడాన్ని నిరసిస్తూ ప్రఖ్యాత కవి, రచయిత, తెలంగాణ సాహిత్య అకాడమీ తొలి అధ్యక్షుడు డాక్టర్ నందిని సిధారెడ్డి ప్రభుత్వ ఇస్తామన్న పురస్కారాన్ని, కోటి రూపాయల నగదు, 300 గజాల స్థలాన్ని తిరస్కరించడం అభినందనీయమని మంజీరా రచయితల సంఘ నేతలు అన్నారు. తెలంగాణ తల్లికి జరిగిన అవమానంగా భావించి సిధారెడ్డి ప్రభుత్వ ఇవ్వజూపిన నజరానాను తిరస్కరించడం గొప్ప విషయం అని అభివర్ణించారు. తన నిర్ణయం ద్వారా తెలంగాణ కవులు రచయితలు తలెత్తుకునే ఉన్నారని నందినిసిధారెడ్డి నిరూపించారన్నారు. ఆయన నిర్ణయం మంజీరా రచయితల సంఘానికి, ఆయన పుట్టిన జిల్లా అయిన సిద్దిపేటకు, కవులకు కళాకారులకు గర్వకారణం అని రచయిత సంఘం తీర్మానించింది.