మెదక్, నవంబర్ 15(నమస్తే తెలంగాణ): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం(ఎన్ఆర్ఈజీఎస్)లో అక్రమాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం కూలీలకు ఈకేవైసీ తప్పనిసరి చేసింది. ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కొత్త నిబంధనలు విధించింది. ప్రత్యేకంగా ఎన్ఆర్ఈజీఎస్ మొబైల్ మానిటరింగ్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. జాబ్‌కార్డు, ఆధార్ కార్డులతో అనుసంధానం చేయడంతో పాటు కూలీల ఫొటోలను యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఈకేవైసీ పూర్తి చేయని కూలీలు ఉపాధి హామీ పనులకు దూరం కానున్నారు. ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అరికట్టడమే లక్ష్యంగా పక్కా ప్రణాళికతో కఠిన నిబంధనలు ముందుకు తెస్తున్నారు. మెదక్ జిల్లాలో ఈకేవైసీ 85శాతం పూర్తయ్యింది. నెలాఖరులోపు వంద శాతం పూర్తి చేసేలా ఈజీఎస్ అధికారులు, సిబ్బంది కృషిచేస్తున్నారు.
స్థానికంగా ఉపాధి కల్పించడం, వలసలు నివారించడమే లక్ష్యంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం గ్రామీణ కూలీలకు భరోసాను ఇస్తున్నది. కొంత మంది ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తూ అక్రమాలకు పాల్పడుతూ సొమ్ము చేసుకుంటున్నారు. జాబ్‌కార్డు తీసుకొని పనులకు హాజరుకాకున్నా వచ్చినట్టు మస్టర్లో వేసుకొని కొందరు వేతనాలు పొందుతున్నారు. పలువురు ఫీల్డ్అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు అక్రమాలకు వంత పాడుతున్నారు. వచ్చిన వేతనాలను చెరిసగం పంచుకుంటున్నారు. దీంతో క్షేత్రస్థాయిలో పనులు జరగకపోగా, ఏటా లక్షలాది రూపాయల ప్రజాధనం దుర్వినియోగమవుతోంది. దీనిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం అక్రమాలకు చెక్ పెట్టేలా ఈకేవైసీ తప్పనిసరి చేసింది.
ఉపాధి పనులకు హాజరైన కూలీలకు మాత్రమే అటెండెన్స్ పడుతోంది. తద్వారా అక్రమాలకు చెక్‌పడి పారదర్శకత సాధ్యమవుతున్నది. మెదక్ జిల్లాలోని 20 మండలాల పరిధిలో ఉపాధి హామీ కూలీల ఈకేవైసీ నమోదు 85 శాతం పూర్తి అయ్యింది. జిల్లాలో 2,06,743 మంది ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. ఇప్పటి వరకు 1,76,660 మంది కూలీల ఈకేవైసీ నమోదు పూర్తిచేశారు. ఈకేవైసీ నమోదైన కూలీలకు మాత్రమే ఆన్లైన్ హాజరు నమోదవుతుంది. కూలీల వివరాలు యాప్‌లో నమోదు కాని పక్షంలో పనికి వెళ్లినా హాజరు నమోదు చేయడం సాధ్యం కాదు. ఉపాధి పనికి హాజరైన కూలీల ఫొటోలు ఉదయం, సాయంత్రం యాప్‌లో నమోదు చేస్తున్నారు. ఉపాధి పనుల్లో మ్యానువల్ పద్ధ్దతిన కూలీలకు పని ప్రదేశాల్లో హాజరును మస్టర్లో ఫీల్డ్ అసిస్టెంట్లు నమోదు చేసేవారు. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీలకు ఆన్లైన్ హాజరుతో పాటు పని ప్రదేశంలో ఫొటోలతో హాజరు నమోదు చేస్తున్నారు. దీంతో మస్టర్ విధానానికి స్వస్తి పలికారు.
మెదక్ జిల్లాలో ఈకేవైసీ నమోదు ఇప్పటి వరకు 85 శాతం పూర్తి చేశాం. ఉపాధి పథకంలో ఈకేవైసీ నమోదు ద్వారా పారదర్శకత సాధ్యమవుతుంది. అక్రమాలను అరికట్టేందుకు ఈకేవైసీ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది. నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేస్తాం. ఉపాధి హామీ పథకం పనుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. లక్ష్యం మేరకు కూలీలకు పని కల్పిస్తాం.
– శ్రీనివాసరావు, డీఆర్డీవో మెదక్