రామాయంపేట రూరల్,మే 15 : పట్టణాలతో పాటు గ్రామాల్లో దొంగతనాలు, ప్రమాదాలు, నేరస్తుల కదలికలు, అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పట్టణాలతో పాటు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు కోసం ఎంతో కృషి చేసింది. వాటి ద్వారా కలిగే మేలు గురించి కూడా విస్తృతంగా ప్రచారం చేసింది. ఫలితంగా కొన్ని గ్రామాల్లో దాతలు ముందుకు రావడంతో పెద్దపెద్ద అపార్టుమెంట్లో ఉండే వారు కెమెరాలను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు వచ్చారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన వాటిని ప్రతి రోజు అధికారులు వచ్చి పరిశీలించేవారు.
కానీ, నేడు చాలా గ్రామాల్లో అవి పని చేయడం లేదు. అంతే కాకుండా వాటిని పట్టించుకున్న వారు ఉండటం లేదు. మండల పరిధిలోని దామరచెర్వు గ్రామ శివారులో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు చెట్టు తీగ అల్లుకొని అవి కనిపించకుండా ఉన్నాయి. రామాయంపేట నుండి గ్రామానికి వచ్చే రోడ్డు దగ్గర గతంలో ఇక్కడ స్తంభాలకు రెండు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే గత కొన్ని నెలలుగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన స్తంభానికి ఓ చెట్టు తీగ పూర్తిగా అల్లుకొని అవి కనిపించకుండా పోయాయి.
ఈ మార్గంలో ప్రతి రోజు ఎన్నో వాహనాలు, ప్రయాణికులు వెళ్తుంటారు. గతంలో దొంగతనాలు, యాక్సిడెంట్లు ఈ ప్రాంతంలో జరిగితే వీటి పుటేజీ ఆధారంగా దొరికిన సంఘటనలు ఉన్నాయి. కానీ ఇప్పుడు దొంగతనాలకు పాల్పడే వారు, యాక్సిడెంట్లు చేసి పారిపోయే వారికి ఇది ఆసరాగా మారింది. ఇప్పటికైనా అధికారులు పట్టించుకొని చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.