మిరుదొడ్డి, నవంబర్ 16: సిద్దిపేట జిల్లా మిరుదొడ్డిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో నేరాల నియంత్రణకు విఘాతం జరిగే అవకాశం ఉంది. మిరుదొడ్డి పోలీసులు ముందుకు వచ్చి దుకాణ సముదాయ యజమానులు, ఆయా కుల సంఘాలు, ప్రజల భాగస్వామ్యంతో డబ్బులు పోగు చేసి 14 వార్డుల్లోని ప్రధాన కూడళ్లలో 20 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్లో సుమారు 50 సెంటీమీటర్ల ఎల్ఈడీ టీవీని ఏర్పాటు చేశారు. కానీ, వాటి నిర్వహణ లేకపోవడంతో సీసీ కెమెరాలు అలంకారప్రాయంగా మారాయి. కొన్నింటిని దుండగులు ఎత్తుకెళ్లి పోయారు.
సీసీ కెమెరాలు పనిచేస్తే నేరాలు జరిగే అవకాశం తక్కువగా ఉంటుంది. దొంగతనాలు చేయడానికి దొంగలు దొరికి పోతామనే భయంతో వెనుకడుగు వేస్తారు. శాంతిభద్రతలను పర్యవేక్షించవచ్చు. పోలీసులు, గ్రామ ప్రముఖులు స్పందించి సీసీ కెమెరాలు పనిచేసేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. టౌన్లో కొందరు ఆకతాయిలు నిత్యం బైక్‌లపై వేగంగా త్రిబుల్ రైడింగ్ చేస్తూ ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. వారితో కఠినంగా వ్యహరించి తగు చర్యలు తీసుకోవాలని మిరుదొడ్డి వాసులు కోరుతున్నారు.