సిద్దిపేట, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. సీసీఐ పెట్టిన నిబంధనలతో తాము కొనలేమని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు పత్తి కొనుగోళ్లు నిలిపివేశాయి. ఈ ఏడాది ఎల్1, ఎల్2, ఎల్3 అనే కొత్త నిబంధన తీసుకువచ్చిందని జిన్నింగ్ మిల్లుల వ్యాపారులు చెబుతున్నారు. సీసీఐ పెట్టిన నిబంధనలను తక్షణమే సడలించాని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా పత్తి కొనుగోళ్లు నిలిచిపోయాయి. దీంతో అన్నదాతలకు తిప్పలు తప్పడం లేదు. దీనిని అదునుగా చేసుకొని కొంత మంది ప్రైవేట్ వ్యాపారులు రైతుల వద్ద మద్దతు ధరకు తక్కువగా పత్తిని కొనుగోలు చేస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ల వారీగా సీసీఐ 46 జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసింది. సిద్దిపేట జిల్లాలో 24, సంగా రెడ్డి జిల్లాలో 20, మెదక్ జిల్లాలో 2 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. వీటి ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభించారు.
సిద్దిపేట జిల్లాలో 3.35 లక్షల ఎకరాలు, మెదక్ జిల్లాలో 36 వేల ఎకరాలు, సంగారెడ్డి జిల్లాలో 1.04 లక్షల ఎకరాల్లో పత్తి సాగుచేశారు. సిద్దిపేటలో 24, సంగారెడ్డి జిల్లాలో 20, మెదక్‌లో 2 జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి.సిద్దిపేట జిల్లాలో 15 లక్షల క్వింటాళ్లు, సంగారెడ్డి జిల్లాలో 12 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. .పత్తి పొడవు రకం రూ. 7,521, మధ్య రకం రూ. 7,121 మద్దతు ధరతో సీసీపీ కొనుగోళ్లు ప్రారంభించింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం సీసీఐ రెండు విధాలుగా పత్తి కొనుగోళ్లు చేయవచ్చు. ఇందులో ఒకటోది బహిరంగ మార్కెట్లో మద్ద తు ధర కంటే తక్కువ ధరతో వ్యాపారులు కొనుగోలు చేస్తుంటే సీసీఐ రంగంలోకి దిగి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేస్తూ పత్తి రైతులు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత సీసీఐపై ఉంటుంది. ఇక రెండోది ప్రైవేట్ వ్యాపారులతో పోటీపడి పత్తిని కొనుగోలు చేయడం, వ్యాపారులు ఒక్కటైతే సీసీఐ వల్ల రైతులకు న్యాయం జరుగుతుంది. కానీ సంస్థ ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.
ఉన్న సీసీఐ కేంద్రాలను మూసివేసే పరిస్థితి ఏర్పడిందని రైతులు చెబుతున్నారు. కేంద్రం పత్తికి మద్దతు ధర రూ. 7,521 నిర్ణయించింది. ప్రస్తుతం ప్రైవేట్ వ్యాపారులు కుమ్మక్కై పత్తిని తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. సీసీఐ పోటీ లేక పోతే రైతులు తీవ్రంగా నష్టపోతారు.పత్తి నాణ్యత, తేమ శాతం పేరిట రైతులకు నష్టం జరుగనున్నది. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి జిల్లాలోని పత్తి వ్యాపారులు అంతా సిండికేట్ అయ్యారు. అటు అధికారులు, ఇటు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతులకు నష్టం జరుగుతుంది. పత్తి వ్యాపారులతో స్థానిక అధికారులు, కొంత మంది నేత లు కుమ్మక్కు అయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రస్తుతం సీసీఐ పెట్టిన నిబంధనలను కఠినతరం చేయడంతో కొనుగోలు ప్రక్రియలో సమస్య ఏర్పడింది. ప్రస్తుత నిబంధనల ప్రకారం ముందుగా నోటిఫై చేసుకున్న ఒక మిల్లులో పత్తిని ఖరీదు చేసి జిన్నింగ్ చేపట్టి బేళ్లు తయారు చేస్తారు. ఆమిల్లులో తయారీ సామర్థ్యం పూర్తయ్యాక నోటిఫై చేసుకున్న మరో జన్నింగ్ మిల్లులో పత్తి ఖరీదు, జిన్నింగ్ ప్రక్రియను చేపడుతారు. ఇలా కొనుగోలు ప్రక్రియ చేపడుతారు.దీంతో మిగతా మిల్లు ల్లో పత్తి కొనుగోలు చేసే పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. సీసీఐ నిబంధనలతో రైతులకు ఆదిలోనే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
పత్తి కొనుగోలుకు సీసీఐ జిన్నింగ్ మిల్లులను నోటిఫై చేసుకున్నా..తాజాగా విధించిన నిబంధన ప్రకారం మొదటి, రెండు, మూడో నిబంధనలతో రైతులు, పత్తి కొనుగోలుదారులు ఇబ్బందులు పడే ఆస్కారం ఏర్పడింది. రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తిని జిన్నింగ్ మిల్లుల యాజమాన్యాలు సీసీఐ నిబంధనల ప్రకారం ఒక క్వింటాల్‌కు 35కిలోల దూది, 65 కిలోల వరకు గింజలను వేరు చేసి ఇస్తారు. దూదిని బేళ్లుగా తయారు చేసి ఇచ్చినందుకు సీసీఐ జిన్నింగ్ చార్జి పేరిట మిల్లుల యాజమాన్యాలకు ఇస్తుంది. పొలా ల నుంచి సేకరించిన పత్తిని సీసీఐ కేంద్రాల్లో విక్రయించేందుకు వెళ్లే రైతులు జిన్నింగ్ మిల్లుల గేట్లవద్ద పడిగాపులు కాయాల్సి వస్తుంది. రాత్రి సమయంలో అక్కడే నిద్రపోయి తమవంతు కోసం ఎదురు చూస్తున్నారు.
పత్తి రైతులకు తేమ నిబంధన శాపంగా మారుతుంది. సీజన్ ఆరంభంలోనే పత్తి కొనుగోలుపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) నిబంధనల ప్రకారం పత్తిలో 8 శాతం నుంచి 12 శాతం మధ్య తేమ ఉంటే మద్దతు ధర ఇవ్వాలి. గతంలో 16శాతం వరకు తేమ ఉన్నా పత్తి కొనుగోళ్లు జరిపారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పత్తి రైతులు వాపోతున్నారు. సీసీఐ తేమ నిబంధనల పేరుతో రిజెక్టు చేసిన పత్తిని రైతుల నుంచి ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులను నిలువునా వ్యాపారులు దోచుకుంటున్నారు. పత్తిపై ఆశలు పెట్టుకున్న రైతుల ఆశలు నిరుగారుతున్నాయి. ప్రైవేట్ వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అటు సీసీఐ పెట్టే నిబంధనలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు.