సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 6: కాటమయ్య రక్షణ కిట్లతో గీత కార్మికులకు భరోసా కల్పిస్తున్నామని రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ, దామోదర రాజనర్సింహ అన్నారు. బుధవారం సంగారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో గీత కార్మికులకు కాటమయ్య సేఫ్టీ కిట్లను మంత్రులు పంపిణీ చేశారు. జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 60 మంది గీత కార్మికులకు కిట్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గీత కార్మికులకు శిక్షణతో పాటు ఉచితంగా కాటమయ్య రక్షణ కిట్లను అందజేస్తున్నట్టు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం కులవృత్తులకు పెద్దపీట వేస్తున్నట్టు వెల్లడించారు. సంప్రదాయ గీత కార్మికులు ప్రమాదాల బారినపడి ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకున్నారని గుర్తు చేశారు. పదేండ్లలో 750 మంది గీత కార్మికులు ప్రమాదాల కారణంగా మరణించారని తెలిపారు. జిల్లాలో 3500 గీత కార్మిక కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని, వారికి శిక్షణ అందించడంతో పాటు ఉచితంగా కాటమయ్య రక్షణ కిట్లను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. బీసీలు రాజకీయంగా ఎదగాలని ఆకాంక్షించారు.
బీసీల రాజకీయ ఎదుగుదల కోసమే సమగ్ర సర్వేను ప్రభుత్వం చేపడుతున్నదని మంత్రులు పేర్కొన్నారు. కార్యక్రమంలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాశ్‌రెడ్డి, కలెక్టర్ వల్లూరు క్రాంతి, అదనపు కలెక్టర్లు చంద్రశేఖర్, మాధురి, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి జగదీశ్, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నవీన్ చంద్, జిల్లా కల్లు గీత కార్మికుల సంఘం అధ్యక్షుడు ఆశన్న గౌడ్ పాల్గొన్నారు.