జిన్నారం, జూన్ 19: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని పాశమైలారం, బొల్లా రం, ఖాజీపల్లి, గడ్డపోతారం, బొంతపల్లి పారిశ్రామిక వాడలు ఉన్నాయి. ఈ పారిశ్రామిక వాడల్లో 1500 వరకు రసాయన, ఇంజినీరింగ్, ప్లాస్టిక్, ఫుడ్ ప్రాసెసింగ్, ఆటోమొబైల్ అనుబంధ పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో 800 వరకు భారీ, మధ్య, చిన్న తరహా రసాయన పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమల్లో దేశంలోని అనేక రాష్ర్టాలకు చెందిన లక్షన్నర మంది వరకు కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు. రసాయన పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలు పాటించకుండా యథేచ్ఛగా కాలుష్య జలాలు బయటకు విడుదల చేస్తున్నాయి. దీంతో పరిశ్రమల్లో విధులు నిర్వహించే కార్మికులు, ఉద్యోగులు, సమీప గ్రామాల్లోని ప్రజలు రోగాల బారిన పడుతున్నారు.
రసాయన పరిశ్రమల యాజమాన్యాలు నిబంధనలు ఉల్లంఘించి యథేచ్ఛగా వాయు, జల కాలుష్యాన్ని వదిలేస్తున్నాయి. రసాయన పరిశ్రమల నుంచి బెంజిన్, ైస్టెరిన్, టోల్యూయిన్, హెవీ మెటల్స్, క్లోరిన్ ఆధారిత రసాయనాలు ఎక్కువగా వెలువడుతున్నాయి. వీటిని దీర్ఘకాలంగా సమీపంలోని ప్రజలు పీలుస్తుండటంతో కణాల నిర్మాణాన్ని దెబ్బతీస్తున్నాయి. ఈ ప్రభావంతో శరీరంలో మార్పులు జరిగి క్యాన్సర్ కణాలు ఏర్పడే అవకాశాలు ఉన్నా యి. ప్రస్తుతం గడ్డపోతారం పారిశ్రామికవాడలో 20 మంది క్యాన్సర్ బారిన పడ్డారు. ఇతర పారిశ్రామికవాడల్లో 100 మంది వరకు క్యాన్సర్ వ్యాధితో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పాటు పరిశ్రమల నుంచి వెలువడుతున్న విష వాయువులను ప్రజలు నిత్యం పీలుస్తుండటంతో శ్వాశకోస సమస్యలు, అలర్జీలు, కిడ్నీ సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాలుష్య నీటిని తాగటం వల్ల గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు త్వరగా అనారోగ్యాల బారిన పడుతున్నారు.
పారిశ్రామిక వాడల్లో ఎప్పటికప్పుడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సి ఉం డగా, పరిశ్రమల యాజమాన్యాలు, పీసీబీ అధికారులు, వైద్యారోగ్య శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. పారిశ్రామికవాడల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్నా, ఎవరూ పట్టించుకోవడం లేదు. గడ్డపోతారంలో ఇటీవల పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి సమక్షంలో జరిగిన ఓ సమావేశంలో కాలుష్యంతో తాము క్యాన్సర్ బారినపడ్డామని, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు కాలుష్యాన్ని నివారించేలా చర్యలు తీసుకోవాలని బాధితులు వేడుకున్నారు.
పారిశ్రామిక వాడల్లో పరిశ్రమల యాజమాన్యాలు యథేచ్ఛగా వాయు, జల కాలుష్యాన్ని వదిలేస్తున్నా పీసీబీ అధికారులు అటు వైపు చూడటం లేదు. పరిశ్రమల యాజమాన్యాలతో కుమ్మకైన పీసీబీ అధికారులు కాలుష్యా న్ని వదులుతున్న పరిశ్రమలపై చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమవుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రాత్రి సమయంలో కాలుష్యాన్ని వదులుతున్న పరిశ్రమలపై పీసీబీ అధికారుల పర్యవేక్షణ కరువైంది. కాలుష్యం వదులుతున్న పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు పీసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తున్నా, స్పందించడం లేదనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
పరిశ్రమలు వదులుతున్న కాలుష్యంతో ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నా అధికారులు, పరిశ్రమల యాజమాన్యాలు పట్టించుకోవటం లేదు. స్థానికంగా దవాఖాన లేకపోవటంతో ప్రజలు వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. తరచూ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయించేలా జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలి. ప్రజల ప్రాణాలు పోతున్నా కాలుష్యాన్ని నివారించేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు.
– బాలుగారి శ్రీనివాస్, గడ్డపోతారం (సంగారెడ్డి జిల్లా)