రామాయంపేట, జూలై 10: కొద్దిపాటి వర్షానికే గిరిజన తండాల మట్టిరోడ్లు చిత్తడిగా మారుతున్నాయి. అందులో వ్యవసాయ పొలాలపై ఇండ్ల నుంచి ట్రాక్టర్ డ్రైవర్లు కేజ్వీల్ వేసుకుని (Cage wheel Tractor) వెళ్లడంతో మరింత దారుణంగా రోడ్లు తయారై నడవలేని పరిస్థితి ఏర్పడుతున్నది. రామాయంపేట మండలం దంతెపల్లి, కాట్రియాల, లక్ష్మాపూర్, సదాశివనగర్, కిషన్తండా పంచాయతీ, బాల్యతండా, బిల్యా గిరిజన తండాలకు చెందిన రోడ్లు గత వారం రోజులుగా వర్షం చినుకులు పడడంతో మట్టి రోడ్డంతా చిత్తడిగా మారింది. అదే రోడ్డులో ట్రాక్టర్లు కేజ్వీల్తో నడవడంతో మరింత అధ్వాన్నంగా తయారవుతున్నాయి. రోడ్లపై కేజ్వీల్తో ట్రాక్టర్లు నడపవద్దని అధికారులు హెచ్చరించినా డ్రైవర్లు పట్టించుకోకుండా వెళ్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రోడ్లపై వెళ్లే ట్రాక్టర్లపై చర్యలు తీసుకుని, మట్టి రోడ్లుగా ఉన్న తండాల రోడ్లను బీటీ రోడ్లుగా మార్చాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం తండాల రోడ్లను బీటీలుగా మారుస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీకి రెండేండ్లు గడుస్తున్నా రోడ్డు వేసిన దిక్కులేదంటున్నారు. ఎన్నికల్లో మాటిచ్చి ఇప్పుడు సర్కార్ పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.
రెండు సంవత్సరాలైనా రోడ్డు మంజూరు చేయరా..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు గడుస్తుంది ఇప్పటికి కూడా మా తండాలకు పోవడానికి రోడ్లు వేయడం లేదని చవాన్ రవి విమర్శించారు. ఎన్నికలప్పుడు హామీలిచ్చిన సర్కార్ అప్పుడే మరచిపోవడం విచిత్రంగా ఉంది. తాము రాత్రి పూట తండాకు వెళ్లాలంటే రోడ్డు అంతా బురదమయంగా ఉండడంతో వెల్లలేకపోతున్నామని, ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు.
కేజ్వీల్ ట్రాక్టర్లతో ఇబ్బందులు..
అసలే మట్టిరోడ్లు ఆ రోడ్డు వెంట నడవాలంటేనే ఇబ్బందిగా మారిందని కేతావత్ వసంత్ అన్నారు. అందులో ఇప్పుడు దున్నకాల సీజన్, ఈ సీజన్లో కేజ్విల్తో మట్టిరోడ్లు ట్రాక్టర్లు వెళ్తే ఇక మాకు వెళ్లడం ఇబ్బందిగా ఉంది. రోడ్డంతా బురదమయంగా ఉంటది. తండాలకు రోడ్లు వేస్తామని ప్రస్తుతం ఉన్న సర్కార్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు రోడ్డు ఊసే ఎత్తడం లేదు. ఇదీ సర్కార్ పనితీరని వాపోయారు.