
కొల్చారం, జనవరి 11 : చదివింది బీటెక్ మెకానికల్.. ఉద్యోగం కోసం చేసి న ప్రయత్నాలు విఫలం కావడంతో ఓ యువకుడు వినూత్న పద్ధతులతో ఆదా య మార్గాలను ఎంచుకున్నాడు. వ్యవసాయ నేపథ్యం ఉన్న కుటుంబం కావడం తో వ్యవసాయ అనుబంధ రంగాన్ని ఎంచుకుని ఉన్న ఊర్లోనే నెలకు రూ.25వే లకు పైగా ఆదాయం ఆర్జిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. మండల కేం ద్రమైన కొల్చారం గ్రామానికి చెందిన యువ రైతు సాయి. రెండేండ్ల క్రితం రూ.5 లక్షలు పెట్టి రోడ్డు సౌకర్యం ఉన్న 22 గుంటల భూమిని, కోళ్లఫారం కొ న్నాడు. కుటుంబ సభ్యుల సహకారంతో కోళ్లఫారం నడుపుతూనే 200 గజాల విస్తీర్ణంలో చేపల గుంత, 28 రకాల పండ్ల మొక్కలతో పాటు వివిధ రకాల మొ క్కలను నాటాడు. మామిడి, బొప్పాయి, జామ, దానిమ్మ, కొబ్బరి, మునగ, శ్రీగంధం, ఎర్రచందనం, టేకు వంటి వివిధ రకాలకు చెందిన మొత్తం 105 చెట్ల పెంచుతున్నాడు. బొప్పాయి, జామ, దానిమ్మ, మునగ చెట్లు కాపు కాసి ఫలసాయం అందిస్తున్నాయి. వీటితో పాటు సేంద్రియ పద్ధతుల్లో టమాట, వంకాయ, మిరప, పుంటి(గోంగూర), ఉల్లిగడ్డను ఇంటి అవసరాలకు పండిస్తున్నాడు.
కోళ్లఫారం పరిసరాల్లోనే చేపలగుంత
కోళ్లఫారం వ్యర్థాలను సద్వినియోగం చేసుకునే దిశగా కోళ్లఫారం ఆవరణలోనే చేపలగుంతను తవ్వించాడు. కోళ్లఫారానికి వేసిన బోర్ ద్వారానే చేపల గుంతను నీటితో నింపి, నల్ల, బంగారుతీగ, బొచ్చ తదితర చేప రకాలను పెంచుతున్నాడు. కోళ్లఫారం ద్వారా ఒక్కో బ్యాచ్‌కు( 45 రోజులు) ఖర్చులు పోను రూ.50వేలు ఆదాయం ఆర్జిస్తున్నాడు.
చిన్ననాటి నుంచి ఆసక్తి..
వ్యవసాయ కుటుంబం కావడంతో చిన్ననాటి నుంచి వ్యవసాయంతో పాటు బర్రెలను పెంచి పాలు అమ్మడం ద్వారా అదనపు ఆదాయం పొందేవాళ్లం. బీటెక్ చదివేటప్పటి నుంచి వినూత్న పద్ధతుల్లో వ్యవసాయం చేయాలనే ఆలోచన వచ్చేంది. చదువు పూర్తి కాగానే ఉద్యోగ ప్రయత్నం చేశా. ఆ తర్వాత 22గుంటల పొలం, కోళ్లఫారం కొన్న. నెలకు రూ.25వేలకు పైగానే ఆదాయం వచ్చేలా వివిధ రకాల వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టి సారించా. ఇప్పుడు సంతృప్తిగా ఉంది.