రాయపోల్, జనవరి 11: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండలంలోని రామారం నుంచి మూడు కిలోమీటర్ల పొడవునా బీటీ నిర్మాణ పనులు నిలిచి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల ‘నమస్తే తెలంగాణ’లో కథనాన్ని ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన ఆర్అండ్బీ అధికారులు వారం నుంచి కంకర రోడ్డుపై బీటీ రోడ్డు పనులు ముమ్మరంగా చేపడుతున్నారు. నెలల కొద్ది కంకర వేసి బీటీ వేయకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు, అధికారులు, నాయకులు సైతం తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
కంకర రోడ్డు ఉండడంతో ఉన్న ఆర్టీసీ బస్సు సౌకర్యం రద్దుకావడంతో విద్యార్థులు ఉన్నత చదువులకు గజ్వేల్‌కు వెళ్లడానికి అనేక ఇబ్బందులు ఎదుర్కున్నారు. కిలోమీటర్ల పొడవునా విద్యార్థులు కాలినడకన గుర్రాలఫోప వరకు రాకపోకలు సాగించేవారు. గతంలో ఈ రోడ్డు మరమ్మతులు చేపట్టాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రోడ్డుపై భైఠాయించి ధర్నా చేశారు. రామారం నుంచి గుర్రాలఫోప వరకు డబుల్ బీటీ రోడ్డు వేయడంతో అటు ప్రయాణికులు, ఇటు విద్యార్థుల ఇబ్బందులు పూర్తిగా తొలిగిపోయాయి.బీటీ రోడ్డు నిర్మాణానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ఆయా గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.