నారాయణఖేడ్/కల్హేర్, మార్చి 31: సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలో బీఆర్ఎస్ కార్యకర్త హరిసింగ్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కల్హేర్ మండలం కొత్తచెరువు తండాకు చెందిన హరిసింగ్(50) తండాలో సొంత ఇల్లు కూడా లేని స్థితిలో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. హరిసింగ్‌కు భార్య, ముగ్గురు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. ఆదివారం ఉగాది సందర్భంగా కల్హేర్‌లో పంచాంగ శ్రవణానికి వెళ్లిన హరిసింగ్ తిరిగి ఇంటికి చేరలేదు. సోమవారం ఉదయం నీలంవాగు సమీపంలో శవమై కనిపించాడు.
సమాచారమందుకున్న సిర్గాపూర్ ఎస్ఐ వెంకట్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హరిసింగ్ మెడకు టవల్ బిగించి హత్య చేసినట్లు అనుమానిస్తున్నారు. డీఎస్పీ వెంకట్‌రెడ్డి, కంగ్టి సీఐ చంద్రశేఖర్‌రెడ్డి ఘట నా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. డాగ్‌స్కాడ్‌తో తనిఖీలు చేపట్టగా జాగిలం మృతదేహం వద్ద నుంచి కొద్ది దూరం వరకు వెళ్లి ఆగిపోయింది. అందుబాటులో ఉన్న సీసీ కెమెరాల నుంచి ఫుటేజీలను సేకరించి వాటి ఆధారంగా విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తున్నంది. పోలీసులు ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం.
హరిసింగ్ హత్య పిరికిపంద చర్య
హరిసింగ్ హత్య పిరికిపంద చర్య అని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. హత్య విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకొని విలేకరులతో మాట్లాడారు. ఇది ముమ్మాటికీ రాజకీయ హత్యేనన్నారు. గతంలోనూ సిర్గాపూర్ మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తను హత్య చేసిన విషయాన్ని గుర్తు చేసిన మాజీ ఎమ్మెల్యే పోలీసులు నిస్పక్షపాతంగా దర్యాప్తు జరిపి హరిసింగ్ హత్యకు బాధ్యులను శిక్షించాలని డిమాండ్ చేశారు.
విలపించిన కుటుంబీకులు
హరిసింగ్ హత్యకు గురి కావడంతో అతడి భార్య, పిల్లలతోపాటు బంధువులు విలపించారు. నిరుపేద కుటుంబం కావడంతో అన్ని తానై కుటుంబాన్ని పోషించుకుంటుండగా అతడి హత్య కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి హరిసింగ్ కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు.
బాధిత కుటుంబానికి అండగా ఉంటానని, ఎప్పుడు ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని వారికి భరోసా ఇచ్చారు. హరిసింగ్ మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టానికి తరలించే ప్రయత్నం చేయగా స్థానికులు అడ్డుకున్నారు. మృతదేహం తరలింపును చాలాసేపటి వరకు అడ్డుకున్నప్పటికీ ఎస్ఐ వెంకట్‌రెడ్డి వారిని సముదాయించి, హత్య చేసిన వారికి కఠిన శిక్ష పడే విధంగా చూస్తామని భరోసా కల్పించి మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు.