తొమ్మిదేండ్లలో సీఎం కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తిరిగి బీఆర్ఎస్ పార్టీని మూడోసారి అధికారంలోకి తెస్తాయని ఎమ్మెల్సీ ఎగ్గెమల్లేశం అన్నారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం ముస్లాపూర్ ఎంజీఎస్ గార్డెన్లో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీకి వెన్నుముకలాంటి కార్యకర్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా కల్పించారు. బీజేపీ పాలిత రాష్ర్టాల ప్రజలు సైతం తెలంగాణ మోడల్‌ను కోరుకుంటున్నారన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా అభివృద్ధి చేస్తున్నప్పటికీ ప్రతిపక్షాలు బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయని, వాళ్లది కేవలం అధికార దాహమే అని మండిపడ్డారు. ఎక్కడో ఉండి హామీలు ఇచ్చే నాయకులను నమ్మొద్దని, స్థానికంగా ఉండి సమస్యలు పరిష్కరించేవారినే ఆదరించాలని అన్నారు. కేంద్రంలో సైతం బీఆర్ఎస్ జెండా ఎగిరే రోజులు దగ్గరలోనే ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు.
అల్లాదుర్గం, మే 23: బీఆర్ఎస్ సర్కారు తొమ్మిదేండ్ల కాలంలో చేసిన అభివృద్ధి పనులు, ప్రజలకు నేరుగా దక్కిన ఫలాలే తిరిగి అధికారంలోకి తెస్తాయని ఆత్మీయ సమ్మేళనం మెదక్ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ ఎగ్గె మల్లేశం అన్నారు. మంగళవారం మండల పరిధిలోని ముస్లాపూర్‌లో బీఆర్ఎస్ అల్లాదుర్గం మండల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మండలంలోని నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పాటు నాటి నుంచి నేటి వరకు అనేక సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి పౌరుడికీ లబ్ధి చేకూరేలా చేసింది బీఆర్ఎస్ సర్కారన్నారు. తెలంగాణలోని మోడల్ పథకాలను దేశంలో అమలు చేయడానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటామని, అధైర్యపడొద్దని భరోసానిచ్చారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేశామని, రానున్న రోజుల్లో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో మరిన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు.
పార్టీకి కార్యకర్తలే వెన్నుముక
బీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే వెన్నుముక లాంటి వారని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మన ముఖ్యమంత్రి రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయని, వివిధ రాష్ర్టాలు కూడా మన పథకాలపై ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. పేదలకు అండగా ఉచిత బియ్యం సరఫరా, కంటి వెలుగు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, ఆరోగ్య మహిళ, మిషన్ భగీరథ, ఆసరా పింఛను ఇలా మన రాష్ట్రంలోనే అమలు అవుతున్నాయని తెలిపారు. ఆయా పథకాలను ఇతర రాష్ర్టాల ప్రజలు కూడా కోరుకుంటున్నారని, వారికి కూడా అందించేందుకే సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ను స్థాపించారని తెలిపారు. ప్రస్తుతం అమలవుతున్న పథకాలు తెలంగాణ ప్రజలు లబ్ధి పొందేలా కార్యకర్తలు కృషి చేయాలన్నారు.
ప్రతి అభివృద్ధి పని ప్రజలకు సహాయం చేయడానికేనని, ప్రతిపక్షాలు ఏవో వంకలు పెడుతూ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పక్క రాష్ర్టాల్లోని అధికారులు, ముఖ్యమంత్రులు మన పథకాలు, అభివృద్ధిని మెచ్చుకుంటే, రాష్ట్ర ప్రతిపక్ష పార్టీలు మన పథకాలను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. స్థానిక సమస్యలపై అవగాహన కలిగి, స్థానికుడైన నాయకుడే ప్రతి సమస్యను పరిష్కరించగలడని, ఎక్కడో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని హామీలు ఇచ్చే నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ నెలకొల్పుతుందని, కేంద్రంలో కూడా బీఆర్ఎస్ జెండా రెపరెపలాడుతుందని, అందుకు కార్యకర్తల కృషి, ప్రజల ఆశీర్వాదం ఉండాలని కోరారు. సమ్మేళనంలో ఎంపీపీ అనిల్‌కుమార్‌రెడ్డి, జడ్పీటీసీ సౌందర్య, మాజీ ఎంపీపీ కాశీనాథ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు నర్సింహులు, పీఏసీఎస్ చైర్మన్ దుర్గారెడ్డి, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు అంజియాదవ్, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు దశరథ్, స్థానిక సర్పంచ్ మల్లేశం, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.