రాయపోల్, జనవరి 13: ఆచరణకు మించి వాగ్ధనాలు చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను నిలువునా మోసం చేసిందని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్ అన్నారు. సోమవారం రాయపోల్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టి అరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం హామీలు నేరవేర్చడంలో ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడలేని విధంగా కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తే, రేవంత్‌రెడ్డి పేదల సంక్షేమాన్ని గాలికొదిలేశారని విమర్శించారు.
ప్రజా సమస్యలు పరిష్కరించమని అడిగితే కేసులు, అరెస్ట్‌లు చేయడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. రైతు భరోసా పేరుతో ఎన్నికలో ఎకరాకు రూ.15వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు రూ.12 వేలు ఇస్తామని ప్రకటించడం సిగ్గుచేటన్నారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఇప్పటికే తీవ్రమైన వ్యతిరేకత మొదలైందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను హామీలపై ప్రజలు నిలదీయాలన్నారు. స్థానిక ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు.
కేసీఆర్ పేదల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలను ఇంటింటికి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తాను చాటుకోవాలని మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్ పిలుపునిచ్చారు. రైతులకు ఇప్పటి నుంచే కరెంట్ కష్టాలు ప్రారంభం కాగా యాసంగి సాగు కోసం కాల్వల ద్వారా సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. జిల్లాల్లో సాగునీటి వనరులకు కొరత లేదని, వాటిని రైతులకు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని ఆరోపించారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, మాజీ జడ్పీటీసీ యాదగిరి, బీఆర్ఎస్ రాష్ట్ర యువజన నాయకుడు రాజిరెడ్డి, మండల నాయకులు మురళీ గౌడ్, జీవన్‌రెడ్డి ప్రకాశ్, మసంపల్లి రాజు, గౌరిగారి పరశురాములు, తిమ్మక్కపల్లి మాజీ సర్పంచ్ రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.