వర్గల్,జూలై 30: కక్షసాధింపు చర్యలు మానుకోవాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.మంగళవారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగాయిపల్లి వద్ద గల కొండపోచమ్మసాగర్ రామాయంపేట్, సంగారెడ్డి లింక్పాయింట వద్ద రైతులతో కలిసి ఆయన నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలేశ్వరంలో పుష్కలంగా నీళ్లు ఉన్నా సుక్కబొట్టు ఎత్తిపోస్తలేరని ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిత్య ప్రవాహంలా మా రిన కూడవెళ్లివాగు, రామాయంపేట్ కెనాల్, సంగారెడ్డి కెనాల్, హల్దీ వాగుల్లో ఇప్పుడు బొట్టునీళ్లు లేవన్నారు.
కాంగ్రెస ప్రభు త్వ విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. రైతు పంటరుణమాఫీలో అనేక కొర్రీలు పెట్టిన ప్రభు త్వం రైతుబంధు మాటే విస్మరించిందన్నారు. కేసీఆర్ కష్టపడి ప్రాజెక్టులు కట్టిస్తే సీఎం రేవంత్‌రెడ్డి నీళ్లు ఎందుకు ఇస్తలేడని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తన తెలంగాణను ఎడారిగా మార్చే కుట్రచేస్తున్నదని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు అడ్రస్ లేకుండా పోయిందన్నారు.
వానకాలం ప్రారంభమై నెలలు గడుస్తున్నా కాలువల ద్వారా సాగునీరు ఇవ్వక రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. ఆయా మండలాల్లో వరినాట్లు ఇంకా పూర్తికాలేదని మొగులుకు మొఖం పెట్టిచూస్తున్నారని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయా ప్రాజెక్టుల ద్వారా రైతాంగానికి నీళ్లివ్వకపోతే త్వరలోనే వేలాది మంది రైతులతో రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం బీఆర్ఎస్ నాయకులతో కలిసి వరినాట్లు వేయని పొలాలు, నీరులేకబోసిపోయిన కెనాల్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, ఆయా గ్రామాల బీఆర్ఎస్ కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.