సంగారెడ్డి జూన్ 29(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో జూన్30, 2025న జరిగిన ప్రమాదంలో మొత్తం 54 మంది కార్మికులు మృతి చెం దారు. పరిహారం కోసం బాధిత కుటుంబాలు ఆందోళన చేసినా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోవడం లేదు. మరోవైపు ఆది నుంచి సిగాచి బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. మాజీ మంత్రి, సిద్దిపే ఎమ్మెల్యే హరీశ్‌రావు బాధితుల కోసం ప్రభు త్వం, పరిశ్రమ యాజమాన్యంపైన పోరాటం చేస్తున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే రెండు గంటల్లో హరీశ్‌రావు సంఘటనా స్థలానికి చేరుకుని అప్పటి జిల్లా కలెక్టర్, ఇతర అధికారులను కలిసి బాధిత కుటుంబాల కోసం వెంటనే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని, ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల పేర్లు తెలియజేయాలని, గాయపడిన వారిని వెంట నే దవాఖానలకు తరలించాలని సూచించారు. అధికారులు అప్పటికప్పుడు హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయడంతోపాటు సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఎనిమిది మంది కార్మికుల మృతదేహాలు లభించలేదు. దీంతో వారిని మిస్సింగ్‌గా చూపించారు. ఎనిమిది మంది మృతి చెందినట్లు వెంటనే ప్రకటించి డెత్‌సర్టిఫికెట్లు వచ్చేలా చూడాలని బాధిత కుటుంబాల పక్షాన హరీశ్‌రావు అధికార యంత్రాంగానికి సూచించారు.
దీంతో అధికారులు మృతి చెందిన ఎనిమిది మంది కార్మికులకు సంబంధించి డెత్‌సర్టిఫికెట్లు జారీ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి హామీ మేరకు బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందజేయాల్సి ఉంది. ఇప్పటి వరకు కేవలం రూ.42 లక్షల పరిహారం మాత్రమే పరిశ్రమ అందజేసింది. అదీ కార్మికుల ఇన్సూరెన్స్ డబ్బులు కలిపి రూ.42 లక్షలు అందజేశారు. దీనిపై మాజీ మంత్రి హరీశ్‌రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని బాధితులతో కలిసి సంగారెడ్డి కలెక్టరేట్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. పరిహారం అందేలా చూడాలని కలెక్టర్‌ను కోరారు. బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ హైకోర్టులో కేసు వేశారు.
ప్రమాదం జరిగే నాటికి సిగాచి పరిశ్రమలో చేరి సంవత్సరం అయ్యింది. ప్రమాదం జరిగిన రోజు తీవ్రంగా గాయపడ్డా. ముఖం, చేతులు కాలిపోయాయి. పూర్తిగా నయం కాలేదు. దవాఖానకు నెలకు ఆరు వేల వరకు ఖర్చు అవుతున్నది. పరిశ్రమ ప్రతినిధులు కేవలం రెండు వేలు మాత్రమే ఇస్తామంటున్నారు. మా ఇబ్బందులను ఎవరూ
పట్టించుకోవడం లేదు.
– సుష్మ, కరీంనగర్ (గాయపడిన బాధితురాలు)
సిగాచి పరిశ్రమలో ఐదేండ్లు పనిచేశా. పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. రెండు కాళ్లు పని చేయడం లేదు. అవసరమైన వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా. ఇంట్లో నేనొక్కడినే సంపాదించే వ్యక్తిని. నాకు ఐదుగురు ఆడపిల్లలు. వారిలో ఇద్దరికి పెళ్లి చేశా మరో ముగ్గురికి చేయా లి. రెండు నెలల క్రితం వరకు పరిశ్రమ ప్రతినిధులు రూ. 13వేలు ఇచ్చారు. ఇప్పుడు ఇవ్వడం లేదు. ప్రభుత్వం మా కుటుంబాన్ని ఆదుకోవాలి.
– రాజేశ్ కుమార్ చౌదరి, బీహార్ (గాయపడిన బాధితుడు)