పటాన్చెరు రూరల్, ఏప్రిల్ 23: ‘చలో వరంగల్’ అంటూ… గోడలపై వెలుస్తున్న బీఆర్ఎస్ బహిరంగ సభ వాల్‌రైటింగ్ ప్రజలను ఆకట్టుకుంటున్నది. మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలను ప్రభావితం చేసిన ప్రచారాస్త్రం వాల్‌రైటింగ్. ఇప్పుడు చాన్నాళ్లకు తిరిగి కండ్లముందు వాల్‌రైటింగ్ దర్శనం ఇస్తుండడంతో ప్రజలు ఆసక్తిగా చూస్తూ తన్మయత్వం చెందుతున్నారు.
ఉద్యమకారుడు, పోరాటయోధుడు కేసీఆర్ 2001లో పార్టీ పెట్టిన సమయంలో ఊరూరా జైతెలంగాణ నినాదాలతో చేయించిన వాల్‌రైటింగ్ ప్రజల్లో చైతన్యాన్ని నింపింది. మీడియా లేని కాలంలో వాల్‌రైటింగ్, హ్యాండ్రైటింగ్ బ్యానర్ల ప్రభావం అధికంగా ఉండేది. గ్రామ నడిబొడ్డున వాల్‌రైటింగ్ రాసివెళ్తే చాలు ఆ తేదీకి ప్రజలు తెలంగాణ సభలకు స్వచ్ఛందంగా వచ్చేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ సభలకు ఇసుక వేస్తే రాలనంతమంది వచ్చి సభలను దిగ్విజయం చేశారు.
ఆశక్తి ఈ వాల్రైటింగ్కు ఉంది. సోషల్ మీడియా, టీవీ చానళ్లు, ఇతర ప్రచార మార్గాలు ఎన్ని ఉన్నా పెయింటర్స్ చేతితో ఫ్లోరోసెంట్ రంగులు వాడి రాసే వాల్‌రైటింగ్ చూడముచ్చటగా ఉండేవి. ప్రజలపై వాల్‌రైటింగ్స్ ప్రభావం చూపేవి. ఉద్యమ స్ఫూర్తిని నింపేది. ఈనెల 27న వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ నిర్వహించే రజతోత్సవ సభ సమాచారం ప్రజల్లోకి వెళ్లేందుకు బీఆర్ఎస్ శ్రేణులు వాల్రైటింగ్కు ఆర్డర్ ఇచ్చారు. ఒకప్పుడు వాల్‌రైటింగ్ చూపిన ప్రభావం ఇప్పుడు కూడా ప్రజల్లో కనిపిస్తున్నది.
కేసీఆర్ పేరును హైలెట్ చేస్తూ, ఉద్యమస్ఫూర్తిని గుర్తుచేసేలా పెయింటర్లు వాల్‌రైటింగ్ చేస్తున్నారు. జిగేల్ అనేలా రాస్తున్న ఈ వాల్‌రైటింగ్‌లు చూడముచ్చటగా ఉంటున్నాయి. ప్రజలు ఆగి మరీ వాటిని చదువుతున్నారు. జైకేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. యువతరం వాల్‌రైటింగ్‌ను కొత్తదనంగా చూస్తుండగా, సీనియర్ సిటిజన్స్ మాత్రం పాత ఉద్యమ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు. చాన్నాళ్లకు చేతినిండా పనిదొరకడంతో పెయింటర్లు ఆనందంతో ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తాము నాలుగు రూపాయిలు చూస్తున్నామని, దశాబ్దకాలంగా ఫ్లెక్సీలు రావడంతో తమను ఎవరు పలకరించలేదని పెయింటర్లు ‘నమస్తే తెలంగాణ’తో అన్నారు.
దశాబ్దం తరువాత తమకు వాల్‌రైటింగ్ పని బాగా దొరుకుతున్నదని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు కేసీఆర్ పేరును రాస్తుంటే వెనుక నుంచి జై తెలంగాణ అని అంటున్నారని పెయింటర్లు పేర్కొనడం విశేషం. కేసీఆర్ పేరుకు రెస్పాన్స్ అద్భుతంగా ఉందని పెయింటర్లు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమం ప్రజల్లోకి నేరుగా వెళ్లేందుకు దోహదపడిన వాల్‌రైటింగ్స్ తిరిగి గ్రామాల్లో ప్రత్యక్షం కావడాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. పటాన్చెరు నియోజకవర్గం మొత్తం పార్టీ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఇన్చార్జి ఆదర్శ్‌రెడ్డి వాల్‌రైటింగ్స్ రాయిస్తున్నారు. మండలాల వారీగా, గ్రామాల వారీగా బీఆర్ఎస్ నాయకులు దగ్గరుండి ఈ వాల్‌రైటింగ్‌ను రాపిస్తున్నారు. గ్రామాల్లో గులాబీ రంగుల గుభాళింపు మళ్లీ మొదలైంది.
నాకు పటాన్చెరు, రామచంద్రాపురం, ఇతర మండలాల్లో వాల్‌రైటింగ్ రాసేందుకు బీఆర్ఎస్ పార్టీ ఆర్డర్ ఇచ్చింది. నాతో పాటు మరో నాలుగు బ్యాచ్‌లు ఊరూరా చలో వరంగల్ వాల్‌రైటింగ్ రాస్తున్నాం. పదేండ్లుగా నాకు వాల్‌రైటింగ్ పనులేవి రాలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ ఇచ్చిన పనితో నేను ఊరూరా వాల్‌రైటింగ్ రాస్తున్నాను. ప్రజల్లో మంచి రెస్పాన్స్ వస్తున్నది. కేసీఆర్ పేరు రాస్తుంటే వెనుకనుంచి జై కేసీఆర్ అని ప్రజలు అరుస్తున్నారు. జైతెలంగాణ అంటూ పిడికిలి బిగించి నినాదాలు చేస్తున్నారు. మేము కేసీఆర్ పేరును ప్రతిచోట కొత్తరకంగా, అట్రాక్షన్ వచ్చేలా రాస్తు న్నాం. చాన్నాళ్లకు మాకు ఉపాధి లభించింది.
– నర్సింలు, పెయింటర్, రామచంద్రాపురం