రాయపోల్ : ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభను (BRS Silver Jubilee) విజయవంతం చేయాలని బీఆర్ఎస్ రాయపోల్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ ( Venkateshwar Sharma ) పిలుపునిచ్చారు. శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
సభను విజయవంతం చేయాలని కోరుతూ శనివారం స్థానిక జీఎల్ఆర్ గార్డెన్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ( MLA Kotta Prabhakar Reddy ) అధ్యక్షతన జరిగే సన్నాహక సమావేశానికి మండలంలోని సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు కార్యకర్తలు, ఉద్యమకారులు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. రజతోత్సవ సభ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) నాయకత్వంలో జరుగనుందని వెల్లడించారు.
అమలు కాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే రోజులు గడ్డు రోజులేనని పేర్కొన్నారు. తెలంగాణ సాధనే ధ్యేయంగా ఏర్పడ్డ బీఆర్ఎస్ గడిచిన 25 సంవత్సరాలు తెలంగాణ సాధన, అభివృద్ధి లక్ష్యంగా పనిచేసిందని అన్నారు. గత పదేళ్ల కేసీఆర్ పాలనలో దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా ఎదిగిందని తెలిపారు. రేవంత్ రెడ్డి పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు.