అందోల్, డిసెంబర్ 20: సీఎం రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లా అభివృద్ధిపై వివక్ష చూపుతున్నారని, ఉద్దేశపూర్వకంగా జిల్లా అభివృద్ధిని ఆయన అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఆరోపించారు. శనివారం సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం సంగుపేటలోని లక్ష్మీనర్సింహా గార్డెన్లో అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మద్దతు సర్పంచ్‌లు, వార్డు సభ్యుల సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క పని సక్కగా పూర్తిచేయలేదన్నారు. ఒక్క పథకం సరిగ్గా అమలు చేయడం లేదన్నారు.
ఆరు గ్యారెంటీల అమలు పత్తాలేకుండా పోయిందన్నారు. సీఎం రేవంత్ అంటేనే సగం… సగం ఆగమాగమని, ఆయన ఏ పనిచేసినా సగం చేయడమే అలవాటని ఎద్దేవా చేశారు. అందుకే ప్రజలు సైతం సర్పంచ్ ఎన్నికల్లో సగం స్థానాలకే కాంగ్రెస్‌ను పరిమితం చేశారని హరీశ్‌రావు అన్నారు. అందోల్ నియోజకవర్గం నుంచి మంత్రి దామోదర రాజనర్సింహ ప్రాతినిధ్యం వహిస్తున్నారని, ఈ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్యం ఏరులై పారించినా, డబ్బులు పంచినా బీఆర్ఎస్ సైనికులు సమిష్టిగా పనిచేయడంతో ఎక్కువ స్థానాల్లో గెలిచిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి రైతుబంధు సగం మందికి ఇచ్చారని, పింఛన్లు పెంచలేదన్నారు. బతుకమ్మ చీరలు కొందరికే ఇచ్చారన్నారు. బస్సుల్లో భార్యలకు ఉచిత ప్రయాణం అని పెట్టారని, కానీ.. భర్తల దగ్గర డబుల్ చార్జీలు వసూలు చేస్తున్నారని విమర్శించారు.
జిల్లాకు అన్యాయం చేస్తున్న రేవంత్..
సీఎంకు సంగారెడ్డి జిల్లా అంటే చిన్న చూపని, ఇప్పటి వరకు జిల్లాకు ఎలాంటి నిధులు ఇవ్వలేదన్నారు. సీఎం జహీరాబాద్ వచ్చి వెళ్లారని, రూపాయి నిధులు ఇచ్చిన పాపాన పోలేదని హరీశ్‌రావు అన్నారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల పేరుతో అందోల్, పుల్కల్, చౌటకూర్ మండలాల రైతులకు సాగునీరు ఇవ్వకపోవడంతో ఇప్పటికే రెండు పంటలు నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత యాసంగి సీజన్లో పంటలు సాగుచేయాలో వద్దో అనే సందిగ్ధంలో రైతులు ఉన్నారని హరీశ్‌రావు అన్నారు. కాల్వలకు ఎన్ని రోజులు మరమ్మతులు చేస్తారు.. సింగూరు ప్రాజెక్టులో నీటిని ఉంచుతారా? ఖాళీచేస్తారా.. రైతులు పంటలను సాగుచేయాలా వద్దా? అధికారులు రైతులకు తెలియజేయాలన్నారు. సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి, అందోల్, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాంతాలను సస్యశ్యామలం చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతలకు శ్రీకారం చుడితే, కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని ఆపి జిల్లా రైతుల నోట్లో మట్టికొట్టిందన్నారు.
మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం అని, కాంగ్రెస్ ప్రభుత్వం ఆపేసిన ప్రతి పథకం మళ్లీ యథావిధిగా కొనసాగిస్తామని హరీశ్‌రావు అన్నారు. గెలిచిన సర్పంచులు బాధ్యతతో పనిచేసి గ్రామాలను అభివృద్ధి చేయాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సర్పంచ్‌లకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. అధికార పార్టీ నాయకుల మాటలకు ఆగం కావద్దని, సర్పంచులకు వచ్చే నిధులు ఎవరు ఆపరన్నారు. గతంలో కేసీఆర్ జీపీలకు వచ్చే నిధులు నేరుగా వారికి వచ్చేలా ఏర్పాట్లు చేశారన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో ఎలాగైతే కష్టపడి పనిచేశారో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో సైతం అలాగే పనిచేయాలని పిలుపునిచ్చారు. సర్పంచ్ ఎన్నికల ఫలితాలు చూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించకపోవచ్చని, ఒకవేళ ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ క్యాడర్ అందుకు సిద్ధంగా ఉండాలని హరీశ్‌రావు పిలుపునిచ్చారు.
పోలీసులు జాగ్రత్త
బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడిందని విమర్శించారు. జిల్లా పోలీసులు అధికారులు ముఖ్య నాయకుల గ్రామాల్లో బసచేశారని, పోతులబొగుడకు ఎస్పీ వచ్చారని, ఓడిన ఓ అభ్యర్థికి బీఆర్ఎస్ కార్యకర్త వేలు చూపాడని అతడిపై కేసు నమోదుచేసి పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. వచ్చేది తమ ప్రభుత్వమేనని, పోలీసులు అప్పుడు కూడా పనిచేయాల్సి ఉంటుందని, దీన్ని గుర్తించి జాగ్రతగా పనిచేయాలని హితవు పలికారు. కార్యక్రమంలో జడ్పీ మాజీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి, డీసీసీబీ వైస్ చైర్మన్ పట్నం మాణిక్యం, నాయకులు రాహుల్‌కిరణ్, వీరారెడ్డి, రజినీకాంత్, కాశీనాథ్, లింగాగౌడ్, లక్ష్మీకాంత్‌రెడ్డి, నారాయణ, నాగభూషణం, శ్రీనివాస్, వెంకటేశం, వీరభద్రరావు, సాయికుమార్, శశికుమార్, విజయ్‌కుమార్, శంకర్, విఠల్, ప్రవీణ్‌రెడ్డి, రామాగౌడ్, నాగరత్నంగౌడ్, 9మండలాల అధ్యక్షులు, కార్యదర్శులు, సర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.