సంగారెడ్డి, డిసెంబర్ 15(నమస్తే తెలంగాణ) : రెండ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ పల్లె ఓటర్లు బీఆర్ఎస్ వెన్నంటి నిలిచారు.సంగారెడ్డి జిల్లాలో పది మండలాల్లో రెండో విడత ఎన్నికలు ఆదివారం జరిగాయి. ఇందులో నాలుగు మండలాల్లో బీఆర్ఎస్ ఆధిక్యతను చాటుకుంది. మిగతా ఆరు మండలాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులకు గట్టి పోటీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడటంతో పాటు ధనబలం, అడ్డగోలు హామీలిచ్చి ఓటర్లను ప్రలోభాలకు గురిచేసింది. 229 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, 81 స్థానాల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు విజయం సాధించారు.రాయికోడ్ మండలంలో 16, ఝరాసంగంలో 15, అందోల్‌లో 12, జహీరాబాద్‌లో 11 సర్పంచ్ స్థానాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
రాయికోడ్ మండలంలో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు పంచాయతీలను క్లీన్ స్వీప్ చేశారు. అందోల్, ఝరాసంగం, జహీరాబాద్ మండలాల్లో బీఆర్ఎస్ మెజార్టీ స్థానాల్లో విజయం సాధించింది. మంత్రి దామోదర రాజనర్సింహ దత్తత గ్రామం నేరేడుగుంటలో బీఆర్ఎస్ మద్దతుదారు ఒగ్గు సాయికిరణ్ కాంగ్రెస్ మద్దతుదారుడిపై 420 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.మంత్రి ముఖ్య అనుచరుడు జగన్మోహన్రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శివరాజ్ స్వగ్రామం నేరేడుగుంట. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బలమైన నాయకులు, క్యాడర్ ఉంది. అయినా బీఆర్ఎస్ ప్రజల మద్దతుతో నేరేడుగుంటలో మూడు దశాబ్దాల తర్వాత చరిత్ర తిరగరాసింది. అందోల్ మండలంలో మేజర్ పంచాయతీలు డాకూరు, తాడుమన్నూరు, చందంపేట, బ్రాహ్మాణపల్లి, నాదులాపూర్, ఎర్రారంలో బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. చాలా పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారులు రెండోసారి సర్పంచ్‌లుగా విజయం సాధించారు.
మునిపల్లి మండలంలో మంత్రి దామోదర రాజనర్సింహ ముఖ్య అనుచరుడు ఎన్నికల్లో నిలువగా, ఇక్కడ బీఆర్ఎస్ ఆరు ఓట్ల మెజార్టీతో సర్పంచ్ స్థానాన్ని కైవసం చేసుకుంది. వట్పల్లి మండలంలోని మేజర్ పంచాయతీలు నాగుపల్లి, నిర్జప్ల, దేవునూరు, బిజీలీపూర్ బీఆర్ఎస్ మద్దతుదారులు గెలుపొందారు. ఝరాసంగం మండలంలో ఎమ్మెల్యే మాణిక్‌రావు స్వగ్రామం ఝరాసంగంలో బీఆర్ఎస్ మద్దతుదారు విజయం సాధించారు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ స్వగ్రామం పోతులబోగూడలలో సైతం బీఆర్ఎస్ మద్దతుదారుడు సర్పంచ్‌గా గెలుపొందారు. జడ్పీ మాజీ చైర్పర్సన్ మంజుశ్రీజైపాల్‌రెడ్డి స్వగ్రామంలో సైతం బీఆర్ఎస్ విజయం సాధించింది.
అందోలు నియోజకవర్గంలోని రాయికోడ్ మండలంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ విజయఢంకా మోగించింది. మండలంలోని మెజార్టీ పంచాయతీల్లో బీఆర్ఎస్ మద్దతుదారుల విజయం సాధించారు. 16 పంచాయతీల్లో బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులు సర్పంచ్‌లు గెలుపొందారు. రాయికోడ్‌లో బీఆర్ఎస్ సర్పంచ్ స్థానంతోపాటు 12 వార్డులను కైవసం చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారు బి.రాధాతుకారం 1365 ఓట్ల అత్యధిక మెజార్టీతో సర్పంచ్‌గా విజయం సాధించింది.సీనియర్ కాంగ్రెస్ నేత సిద్దన్నపాటిల్ స్వగ్రామం నల్లంబల్లి లో బీఆర్ఎస్ సర్పంచ్ విజయం సాధించారు.
గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంజయ్య స్వగ్రామం నాగ్వార్లో బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపిన సర్పంచ్ అభ్యర్థి గట్టిపోటీ ఇచ్చారు. రాయికోడ్ మండలంలోని మేజర్ పంచాయతీలు ఇటికేపల్లి, సింగీతం, పంపాడ్, సిరూర్ గ్రామాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రలోభాలకు గురిచేసినా వారికి నిరాశే మిగిలింది. కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకతతో ఓటర్లు గులాబీ పార్టీ వెన్నంటే నిలిచారు.