సంగారెడ్డి, ఆగస్టు 5(నమస్తే తెలంగాణ) : కాళేశ్వరం ప్రాజెక్టు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ నుంచి మంగళవారం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ను సంగారెడ్డిలో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో రెండు పెద్ద స్క్రీన్లలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, భూపాల్‌రెడ్డి, జిల్లా నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్టులు వీక్షించారు.
అనంతరం మీడియాతో నాయకులు మాట్లాడారు. ఈ సందర్భంగా చింతా ప్రభాకర్ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికలో పేర్కొన్న అంశాలు, ఆరోపణలు పటాపంచలు అయ్యేలా మాజీ మంత్రి హరీశ్‌రావు తన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ రైతులకు లాభం చేకూర్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని గుర్తుచేశారు.
ప్రాజెక్టులోని ఒక బ్యారేజీలోరెండు పిల్లర్లు కుంగితే ప్రాజెక్టు మొత్తం కూలిందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇకనైనా రేవంత్‌రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ పక్కనబెట్టి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ జిల్లా నాయకులు జైపాల్‌రెడ్డి, కాసాల బుచ్చిరెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, వెంకటేశ్‌గౌడ్, గోవర్థన్‌రెడ్డి, డా.శ్రీహరి, విజయేందర్‌రెడ్డి, సాయికుమార్, విజయ్, బీఆర్ఎస్ కార్యకర్తలు, జర్నలిస్టులు పాల్గొన్నారు.
గులాబీ అధినేత కేసీఆర్‌పై నిందలు తగవు
ఈ సందర్భంగా జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు ఎంతో మేలు జరిగిందన్నారు. రైతులకు మంచిచేసిన గులాబీ అధినేత కేసీఆర్‌పై నిందలు వేయడం తగదన్నారు. రేవంత్‌రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టుపై దుష్ఫ్రచారాన్ని ఆపకపోతే ప్రజలు తగిన బుద్ధిచెబుతారని హెచ్చరించారు.
పీపీటీ చూడకుండా పవర్ కట్
సంగారెడ్డి క్యాంపు కార్యాలయంలో మంగళవారం పవర్ పాయింట్ ప్రజంటేషన్ను నాయకులు, కార్యకర్తలు, జర్నలిస్టులు వీక్షించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలకు పాల్పడింది. మధ్యాహ్నం 12 గంటలకు మాజీ మంత్రి హరీశ్‌రావు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ప్రారంభం కాగా, సంగారెడ్డిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి కరెంటు కట్ చేశారు. దీంతో వీక్షించకుండా ఆటంకం కలిగింది. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు సెల్ఫోన్లో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ వీక్షించారు.
తిరిగి 12.25 గంటల ప్రాం తంలో కరెంటు తిరిగి వచ్చింది. ఆ తర్వాత పెద్ద డిజిటల్ స్రీన్లపై పవర్‌పాయింట్ ప్రజంటేషన్ను బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. కాగా కరెంటు కట్ చేయటంపై ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన పవర్‌పాయింట్ ప్రజంటేషన్ను జిల్లాల్లోని నాయకులు వీక్షించకుండా ప్రభుత్వం కరెంటు కట్ చేయించిందని మాజీ మంత్రి హరీశ్‌రావు తన ప్రసంగంలో పేర్కొన్నారు.
పిల్లర్లు కూలడం వెనుక కుట్ర
మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మాట్లాడుతూ.. మేడిగడ్డ బ్యారేజ్‌లోని రెండు పిల్లర్లు కూలడం వెనక కాంగ్రెస్ కుట్ర ఉందని ఆరోపించారు. ప్రాజెక్టులు దెబ్బతింటే వెంటనే మరమ్మతులు చేయించాల్సిది పోయి, కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందంటూ దుష్ప్రచారం చేస్తున్నదని మండిపడ్డారు. గోదావరి నీళ్లు అక్రమంగా బనకచర్లకు తరలించేందుకు రేవంత్‌రెడ్డి కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.
మరమ్మతులు చేయకుండా సర్కారు కుట్రలు
నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎవరికీ సాధ్యం కాని విధంగా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేశారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రెండు ఫిల్లర్లు కుంగితే మరమ్మతులు చేయించకుండా కాంగ్రెస్ ప్రాజెక్టు మొత్తం కూలిందని చెప్పడం సరికాదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ఆపకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.