సంగారెడ్డి, ఏప్రిల్ 5: కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు శనివారం(నేడు) బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతుదీక్ష చేపడతామని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శుక్రవారం ప్రకటనలో తెలిపారు. ఈ దీక్షకు మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని, సంగారెడ్డిలోని నటరాజ్ థియేటర్ వద్ద దీక్షాస్థల్ వద్ద ఉదయం 9.30గంటలకు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
నియోజకవర్గంలోని నాలుగు మండలాలు, రెండు మున్సిపాలిటీలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీసంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. పార్టీ ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, సొసైటీ చైర్మన్లు, రైతుబంధు సమితి అధ్యక్షులు, బీఆర్ఎస్ నాయకులు తరలివచ్చి దీక్షను విజయవంతం చేయాలని కోరారు.