కంది, జూలై 28: సిగాచి పరిశ్రమలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం ఏమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సీఎం రేవంత్ రెడ్డిని నిలదీశారు. సిగాచి ప్రమాదం జరిగి నెలరోజులు గడుస్తున్నా ప్రభుత్వం బాధిత కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరిహారం అందజేయడంలో రేవంత్ సర్కార్ బాధ్యతారహితంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సోమవారం సిగాచి బాధిత కుటుంబ సభ్యులతో కలిసి సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.
అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌ను కలిసి సిగాచి బాధిత కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను మాజీ మంత్రి హరీశ్‌రావు వివరించారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో ప్రమాదం జరిగి 54 మంది మృతి చెందినట్లు చెప్పారు. ప్రమాదంలో మృతి చెందిన చోటేలాల్ భార్య సంజుదేవీకి ఇప్పటి వరకు పరిహారం రాలేదని, ఇతరులకు ఇచ్చిన విధంగా రూ.10 లక్షలు కూడా ఇవ్వలేదని తెలిపారు. ఒడిశాకు చెందిన సిద్ధార్థగౌడ ప్రమాదంలో మృతి చెందాడని, అతడి కుటుంబ సభ్యులకు పరిహారం దక్కలేదన్నారు.
మృతుడు సిద్ధార్థగౌడ సోదరుడు వికాస్‌గౌడ పరిహారం కోసం కంపెనీ ప్రతినిధులు, అధికారులను కలిసినా పరిహారం డబ్బులు ఇవ్వడం లేదన్నారు. యశోద దవాఖానలో చికిత్స పొందుతున్న సుష్మ, అభిలాష తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నట్లు చెప్పారు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సతీశ్‌కుమార్ తండ్రి జగదీశ్‌ప్రసాద్ ప్రమాదంలో మృతి చెందాడని, వారికి పంచనామా రిపోర్టు, ఎఫ్ఐఆర్ కాపీలు కూడా ఇవ్వడం లేదన్నారు. ప్రమాదంలో మృతిచెందిన వారి బంధువులకు వెంటనే పంచనామా కాపీ, డెత్ సర్టిఫికెట్లు అందజేయాలని డి మాండ్ చేశా రు.
మిస్సింగ్ గా ప్రకటించిన ఎనిమిది మంది కార్మికులు మృతి చెందినట్లు ప్రకటించి పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌కు ఆయన కోరారు. ప్రమాదంలో మృతిచెందిన జస్టిన్ కుటుంబ సభ్యులకు కేవలం రూ.10 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారని తెలిపారు. బీహార్‌కు చెందిన మోయినుద్దీన్ఖాన్తో పాటు ఇతర బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా వెంటనే పరిహారం అందేలా చూడాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్‌ను కోరారు. ఈ మేరకు మాజీ మంత్రి హరీశ్‌రావు బాధితులతో కలిసి అదనపు కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు.
సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మృతిచెందిన కార్మిక కుటుంబాలకు వెంటనే రూ. కోటి పరిహారం అందజేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన విలేకరులతో మా ట్లాడారు. సిగాచి ఘటన జరిగి నెలరోజులు గడుస్తున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఇంత వరకు విచారణ పూర్తి చేయలేదని, 54 మంది కార్మికులు చనిపోతే పరిశ్రమపై ఒక్కకేసు పెట్టలేదని, యాజమాన్యంలో ఒక్కరిని కూడా అరెస్టు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిగాచి ఘటన విషయంలో ప్రభుత్వం విచారణ నామమాత్రంగా ముగించే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
బాధిత కుటుంబ సభ్యులు పరిహారం కోసం కంపెనీ ప్రతినిధులను ప్రశ్నిస్తే పరిహారం డబ్బులు వచ్చేందుకు ఏడాది పట్టవచ్చని మమ్ముల్ని అడగవద్దని వారు సమాధానం ఇస్తున్నారని తెలిపారు. నిర్ధిష్ట సమయంలో ప్రభుత్వం రూ. కోటి పరిహారం ఇవ్వకపోతే బాధితులతో కలిసి పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకు అందోళన చేస్తామని స్పష్టం చేశారు. దవాఖానల్లో చికిత్సపొందుతున్న వారికి ప్రభుత్వం రూ.50 వేలు ఇచ్చి చేతులు దులుపుకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 లక్షల పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు.
ప్రమాద ఘటనపై యశ్వంత్ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడని, ఫిర్యాదులో తన తండ్రి జగన్మోహన్ మృతికి కంపెనీ కారణమని పోలీసులకు చెప్పాడన్నారు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి మాట్లాడుతూ సిగాచి ప్రమాదం జరిగి నెలరోజులు గడుస్తున్నా బాధిత కుటుంబ సభ్యులకు పరిహారం ఇవ్వకపోవడం దారుణమన్నారు. సిగాచి ఘటనలో కంపెనీ నిర్లక్ష్యం, ప్రభుత్వ వైఫల్యం స్ప ష్టంగా కనిపిస్తుందన్నారు. మిస్సైన ఎనిమిది మంది మృతదేహాలు కనిపెట్టి ఇవ్వకుండా ప్రభు త్వం చోద్యం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జహీరాబాద్ ఎమ్మె ల్యే మాణిక్‌రావు మాట్లాడుతూ సిగాచి ప్రమాదంలో 54 మంది చనిపోతే ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదన్నారు. బాధిత కుటుంబాలకు వెంటనే రూ.కోటితో పాటు ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, మఠం భిక్షపతి, దేవేందర్, జిల్లా నాయకులు కాసాల బుచ్చిరెడ్డి, ఆదర్శ్‌రెడ్డి, శ్రీకాంత్‌గౌడ్, వెంకటేశ్‌గౌడ్, కార్పొరేటర్ సింధూఆదర్శ్‌రెడ్డి, నాయకులు నామా రవి కిరణ్, చేర్యాల ప్రభాకర్, కొండల్‌రెడ్డి, పటాన్చెరు, సంగారెడ్డి నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.
సిగాచి బాధితులకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ సంగారెడ్డి, పటాన్చెరు నియోజకవర్గ నాయకులు పెద్దసంఖ్యలో సంగారెడ్డి కలెక్టరేట్‌కు తరలివచ్చారు. మాజీ మంత్రి హరీశ్‌రావు బాధితులతో కలిసి కలెక్టరేట్‌లోకి వెళ్లిన వెంటనే ఆయనతోపాటు బీఆర్ఎస్ నాయకులు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే, సిగాచి బాధితుల వాహనాలను సైతం కలెక్టరేట్‌లోకి అనుమతించలేదు.
దీంతో బీఆర్ఎస్ నాయకులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు, సిగాచి బాధిత కుటుంబాల వాహనాలను వెంటనే కలెక్టరేట్‌లోకి పంపాలని బీఆర్ఎస్ నాయకులు పట్టుబట్టారు. దీంతో పోలీసులు వాహనాలను లోపలికి అనుమతి ఇచ్చినా బీఆర్ఎస్ నాయకులను లోనికి వెళ్లనీయలేదు. దీంతో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు సీఎం రేవంత్‌రెడ్డి డౌన్‌డౌన్.. కాంగ్రెస్ డౌన్ డౌన్ అంటూ కలెక్టరేట్ గేటు ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా పోలీసులు, బీఆర్ఎస్ నాయకులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకున్నది. చివరకు మాజీ మంత్రి హరీశ్‌రావు చొరవతో పోలీసులు బీఆర్ఎస్ నాయకులను కలెక్టరేట్‌లోకి అనుమతించారు.