రాయపోల్,అక్టోబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు కొనసాగాలంటే ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కు పట్టం కట్టాలని బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాయపోల్ మండలంలోని మంతూర్, అనాజీపూర్, చౌదరిపాలెం, చిన్నమాసాన్‌పల్లి, లింగారెడ్డిపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. మొదట మంతూర్ గ్రామస్తులు ఆయకు బ్రహ్మరథం పట్టారు. అనంతరం చౌరస్తాలో బీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ఓట్లు వేస్తే ఆగమైపోతామని, కరెంట్, నీటి కష్టాలు తప్పవన్నారు. రాష్ట్రంలో ముడోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రగతి ఫలాలు అందాలంటే కారుగుర్తుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. సబ్బండ వర్గాల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేశారన్నారు. సాగునీటి ప్రాజెక్టులు నిర్మించి రాష్ర్టాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఎన్నికల్లో దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏం చేసిందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ నాడు పోరాటం చేసి తెలంగాణ సాధించాడని గుర్తుచేశారు. నేడు సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశంలో ఆదర్శంగా గుర్తింపు వచ్చాయన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను పెంచి మహిళలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు గుర్తుచేశారు. రైతుల వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుందన్నారు. మహిళలకు రూ.400 గ్యాస్ సిలిండర్ అందిస్తామని, కాంగ్రెస్ పార్టీది కుర్చీలాట, బీజేపీ మతరాజకీయమని, కానీ బీఆర్ఎస్ ప్రజా సంక్షేమమే లక్ష్యమన్నారు. పదేండ్లు మెదక్ ఎంపీగా గెలిపించారని, ఈ సారి దుబ్బాకలో ఎమ్మెల్యేగా ఆశీర్వదించి గెలిపిస్తే సిద్దిపేట, గజ్వేల్‌కు ధీటుగా దుబ్బాక నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని ఆయన పేర్కొన్నారు.
మోసగాళ్లను నమ్మితే గోసపడతాం
ఎన్నికల సమయంలో వచ్చే మోసగాళ్లను నమ్మితే గోసపడతామని, గత ఉప ఎన్నికల్లో మాయమాటలు చెప్పి ఓట్లు దండుకొని ఎమ్మెల్యే రఘునందర్రావు ప్రజలకు చేసిందేమీలేదని ఆయన విమర్శించారు. ఢిల్లీకి గులాంగిరి చేసే పార్టీలతో అభివృద్ధి జరగదన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎల్ల్లప్పుడు ప్రజా శ్రేయసుకోసం ప్రజలకు అందుబాటులో ఉండి పథకాలు అందిస్తూ అండగా ఉంటారన్నారు.
కొత్త ప్రభాకర్‌రెడ్డికి బ్రహ్మరథం పట్టిన ప్రజలు
రాయపోల్ మండలంలో మొదటి విడతలో భాగంగా గ్రామాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. భారీ సంఖ్యలో మహిళలు బోనాల ఉరేగింపులు, బతుకమ్మ ఆటలు, యువకుల నృత్యాలు, ముదిరాజ్‌ల జలకడువలు, దారిపొడవునా డప్పు చుప్పులు, పూల వర్షాలు కురిపించారు.
బీఆర్ఎస్లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు
మండలంలోని అంకిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ రాజిరెడ్డితో పాటు 20 మంది కాంగ్రెస్ కార్యకర్తలు కొత్త ప్రభాకర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. చిన్నమాన్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన యవకులు కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు సోలిపేట సతీశ్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, రాయపోల్ మండల ఇన్చార్జి వెంకట్‌నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మోహన్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్వర శర్మ, జడ్పీటీసీ యాదగిరి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, మండల కోఆప్షన్ సభ్యుడు పర్వేజ్, సొసైటీ చైర్మన్ వెంకట్‌రెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ పడకంటి శ్రీనివాస్, బీఆర్ఎస్ యువజన నాయకులు స్వామి, దయాకర్, రాజిరెడ్డి, పాల రామాగౌడ్, మాజీ ఎంపీపీ రామకృష్ణారెడ్డి, లక్ష్మారెడ్డి, ప్రవీణ్, దయాకర్‌రెడ్డి, శ్రీధర్, రామచంద్రంగౌడ్, వెంకట్‌గౌడ్, సత్యం, భుజ్జి పాల్గొన్నారు.