జహీరాబాద్, ఏప్రిల్ 18 : దేశ ప్రజలు భారత రాష్ట్ర సమితిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, తెలంగాణలో మూడోసారి అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు, నాయకులు సంక్షేమ పథకాలను విస్తతృంగా ప్రచారం చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు తెలిపారు. మంగళవారం ఝరాసంగం వాసవీ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. వ్యవసాయానికి 24గంటల కరెంట్ సరఫరా చేస్తున్నారని, భూగర్భ జలాలు పెంపొందించేందుకు చెరువులు, చెక్‌డ్యాంలు నిర్మాణం చేసి ప్రతి వర్షం నీటి చుక్కను నిల్వ చేశారన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుతో నీటిని తీసుకువచ్చి జహీరాబాద్ నియోజకవర్గంలోని బీడు భూములకు నీటిని అందించేందుకు సంగమేశ్వర పథకానికి శ్రీకారం చుట్టారని, పనులు ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదన్నారు. ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేస్తున్నామన్నారు. దళిత బంధు పథకంలో అర్హులైన వారిని ఎంపిక చేసి ఆర్థిక సహాయం చేస్తున్నామన్నారు. అన్ని వర్గాల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభు త్వం కృషి చేస్తుందన్నారు. ప్రజలు బీఆర్ఎస్ను ఆశీర్వదించాలని కోరారు. సమావేశంలో ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ మాల్కాపూరం శివకుమార్, జహీరాబాద్ సీడీసీ చైర్మన్ ఉమాకాంత్ పాటిల్, ఝరాసంగం మండలాధ్యక్షుడు రాచయ్యస్వామి, బీఆర్ఎస్ నాయకులు సుభాశ్‌రావు, విజేందర్‌రెడ్డి, నర్సిములుగౌడ్, సంగమేశ్వర్, వివిధ గ్రామల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.