సంగారెడ్డి, జూలై 11: భూములు సేకరించడంలో చూపిన ఉత్సాహాన్ని నిర్వాసితులకు పరిహారం అందజేయడంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ఆరోపించారు. శుక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు సమాచారం లేకుండా భూసేకరణ చేయవద్దని, నియోజకవర్గ పరిధిలోని ఫసల్వాది, ఆరుట్ల, ఇంద్రకరణ్, కంది గ్రామాల్లో హెచ్ఎండీఏ మోడల్ లేఅవుట్ చేసేందుకు ల్యాండ్ పూలింగ్ జరిగిందన్నారు. భూములు కోల్పోయిన రైతులకు ఎకరానికి 600 గజాల చొప్పున స్థలం ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుని ఇప్పటి వర కూ వారికి హక్కు పత్రాలు ఇవ్వలేదని ఆరోపించారు.
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ రైతులు తిరుగుతూ తమకు అందాల్సిన పరిహారం అందించాలని దరఖాస్తు చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. దశాబ్దాలుగా అసైన్డ్ భూమిని నమ్ముకుని జీవిస్తున్న పేదరైతులకు ఇప్పటికీ పరిహారం అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు. ల్యాండ్ పూలింగ్‌కు భూములు కోల్పోవడంతో రైతులకు రెండేండ్లుగా రైతుబంధు, రైతు బీమా పథకాలు రావడం లేదన్నారు. భూము లు లాక్కొని లేఅవుట్ చేయలేదని రైతులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్నారు. భూ నిర్వాసితులకు తక్షణమే పరిహారం చెల్లించాలని, లేదంటే వారి భూములు వారికి ఇవ్వాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఆర్ వెంకటేశ్వర్లు, నాయకులు మామిళ్ల రాజేందర్, మాజీ కౌన్సిలర్లు విష్ణవర్ధన్, అశ్విన్, ఎన్ఆర్ఐ శకిల్, శ్రవణ్‌రెడ్డి తదితరు లు పాల్గొన్నారు.